ఇప్పటికే అతి పెద్ద కుంభకోణంలో చిక్కుకుని సమస్యలతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)కి మరో కష్టం వచ్చి పడింది. ఏటీఎం మోసాల ద్వారా పీఎన్బీ ఖాతాదారుల సొమ్ములు స్వాహా అయిపోతున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: ఇప్పటికే అతి పెద్ద కుంభకోణంలో చిక్కుకుని సమస్యలతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)కి మరో కష్టం వచ్చి పడింది. ఏటీఎం మోసాల ద్వారా పీఎన్బీ ఖాతాదారుల సొమ్ములు స్వాహా అయిపోతున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంపై ఢిల్లీలోని వసంత్ విహార్ బ్రాంచ్ బ్యాంకు అధికారులే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తమ సొమ్ము భద్రంగా ఉందా? అంటూ ఆ బ్యాంకు ఖాతాదారుల్లో అలజడి మొదలైంది.
కాగా, మూడు రోజుల వ్యవధిలోనే నకిలీ కార్యకలాపాల ద్వారా 61మంది వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు రూ. 15లక్షల గల్లంతు కావడం గమనార్హం. బ్యాంకు ఖాతాదారులు తమ వ్యక్తిగత కీలక సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని సూచనలు చేస్తున్నా.. ఏటీఎంలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా ఇలాంటి మోసాలు జరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏప్రిల్ 8న తన ఖాతా నుంచి తన ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక ఖాతాదారుడు పీఎన్బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించారు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ తర్వాత మరికొందరు ఖాతాదారులు కూడా సదరు బ్రాంచీని సంప్రదింంచారు.
మొత్తం 61మంది ఖాతాదారులు తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందంటూ ఫిర్యాదులు చేశారు. వీరి ఖాతాల నుంచి మొత్తం రూ. 14,97,769 పోయాయని బ్యాంకు అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఇంటి దొంగలపనేనా? లేక బయటి వ్యక్తులు చేశారా? అనే రెండు కోణాల్లో విచారణ చేపట్టారు. బ్యాంకు సిబ్బంది ఎవరైనా కస్టమర్ల డేటాను బయటివారికి ఇచ్చారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
కాగా, మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించే కస్టమర్లు తమ ఖాతాల సురక్షితం కోసం ఆటో లాక్స్, పిట్ టూ సిమ్, మెమోరీ కార్డుకు పాస్‌వర్డ్ లాంటి మూడు మార్గాలను ఎంచుకోవాలని పీఎన్బీ సూచించింది.
