Asianet News TeluguAsianet News Telugu

చైనా విమానాలకు కరోనా వైరస్.... 2లక్షల కోట్ల నష్టం అంచనా....

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్​ ప్రభావం అంతర్జాతీయంగా అన్ని రంగాలపై పడుతోంది. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధానంగా చైనాకు విమానాల రాకపోకలను నిలిపేశాయి ఇతర దేశాలు. ఫలితంగా విమానయాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) తెలిపింది. చైనాలో కరోనా వైరస్​ ప్రభావం వల్ల వాయు రవాణా డిమాండ్ 13 శాతం పడిపోయిందని ఐఏటీఏ వెల్లడించింది. ఇప్పటికే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన సంస్థలు 1.5 బిలియన్ డాలర్లు నష్టపోయాయని తెలిపింది. 

Asia Pacific carriers to lose $27.8 billion revenue due to coronavirus: IATA
Author
Hyderabad, First Published Feb 22, 2020, 1:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: వివిధ దేశాలు, ప్రాంతాల ప్రాంతాల మధ్య ప్రయాణానికి విమానాలు ఎంతో ముఖ్యం. అతి తక్కువ సమయంలో ఈ విమానాలు కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీటి రాకపోకల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు. ప్రయాణికుల సంఖ్య తగ్గితే విమాన కంపెనీలకు నష్టాలూ తప్పవు. 

అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ విమానయాన సంస్థల పాలిట శాపంలా మారింది. ఇప్పటికే ఈ వైరస్‌ చాలా మంది ప్రాణాలను బలిగొంది. వేల మంది దీని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు చైనాకు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దీని వల్ల విమాన కంపెనీలు భారీ స్థాయిలో రాబడిని కోల్పోతాయన్న అంచనాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన కంపెనీలు ఈ ఏడాదిలో ఉమ్మడిగా 2,780 కోట్ల డాలర్ల రాబడిని కోల్పోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఆందోళన చెందుతున్నది. కరోనా వైరస్‌ సంక్షోభమే ఇందుకు కారణమని ఐఏటీఏ పేర్కొంది.

also read అంతా ఇండియా వల్లే: ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్...

ఈ ఏడాది మొత్తంలో ప్రయాణికుల డిమాండ్‌లో 13 శాతం తగ్గుదల ఉంటుందన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపింది. ‘‘ఏడాది ఎయిర్‌లైన్స్‌కు చాలా కష్టమైన సంవత్సరం’’ అని ఐఏటీఏ సీఈఓ అలెగ్జాండర్‌ దీ జునియాక్‌ తెలిపారు. విస్తరిస్తున్న వైరస్ నియంత్రణ అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. ఇంతకు ముందు 2008-09 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పటివరకెన్నడూ ఈ స్థాయిలో విమాన ప్రయాణ డిమాండ్‌ తగ్గలేదన్నారు. 

ఈ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల రాకపోకలు 4.7 శాతం తగ్గవచ్చని ఐఏటీఏ భావిస్తోంది. చైనాలోని ఎయిర్‌లైన్స్‌ దేశీయ మార్కెట్లోనే 1,280 కోట్ల డాలర్ల రాబడిని కోల్పోయే అవకాశం ఉంది. ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌ వెలుపలి విమానయాన కంపెనీలు 150 కోట్ల డాలర్ల నష్టాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

Asia Pacific carriers to lose $27.8 billion revenue due to coronavirus: IATA

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల వివిధ దేశాల ఎయిర్‌లైన్‌ కంపెనీలు 2,930 కోట్ల డాలర్లు (రూ.2లక్షల కోట్లు) కోల్పోవచ్చని అంచనా వేస్తోం ది. ఒకవేళ వైరస్‌ ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో మరింతగా విస్తరిస్తే ఇతర ప్రాంతాల్లోని ఎయిర్‌లైన్స్‌పై కూడా ప్రభా వం ఎక్కువగా ఉంటుందని ఐఏటీఏ హెచ్చరిస్తోంది. 

అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదిలో ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లోని ఎయిర్‌లైన్స్‌ 4.8 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు తలక్రిందులయ్యాయి. అయితే కొన్ని అంశాలతో మాత్రం ఎయిర్‌లైన్‌ ఇబ్బందులు కాస్త తగ్గడానికి అవకాశం ఉందంటున్నారు. 

తాజాగా చైనాలో కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలైన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఆస్ర్టేలియాకు చెందిన క్వాంటాస్‌, అమెరికాకు చెందిన మూడు అతిపెద్ద విమానయాన కంపెనీలు చైనాకు విమాన సర్వీసులను రద్దు చేశాయి. 

also read బాలీవుడ్ సినిమాపై ట్రంప్ కామెంట్...సోషల్ మీడియాలో వైరల్....

కొన్ని సందర్భాల్లో విమాన సర్వీసుల రద్దు ఏప్రిల్‌/ మే నెలాఖరు వరకు కొనసాగవచ్చంటున్నారు. ఉద్యోగులు మూడు వారాల పాటు వేతనం లేని సెలవు తీసుకోవాలని క్యాథేపసిఫిక్‌ కోరింది. చాలా దేశాలు చైనాకు వెళ్లవద్దని తమ దేశ పౌరులకు సూచిస్తున్నాయి. చాలా మంది స్వచ్చందంగా తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. 

‘ప్రభుత్వం ప్రతికూల ఆర్థిక ప్రభావాల నుంచి బయటపడడానికి ద్రవ్య, పరపతి విధానాన్ని వినియోగించే అవకాశం ఉంది. ఇంధన ధరలు తక్కువగా ఉన్నందున కొన్ని విమాన యాన కంపెనీలకు కొంత ఉపశమనం లభించవచ్చు. అయితే ఇది ఎంత కాలమన్న దాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది’ అని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) వ్యాఖ్యానించింది.

‘ఇక కంపెనీలు రాబడులను కోల్పోతే వాటి లాభాలపై ఎంత మేరకు ప్రభావం ఉంటుందన్న దాని గురించి ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికే ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు తమ సామర్థ్యాలను తగ్గించుకుంటున్నాయి. కొన్ని రూట్లకు సర్వీసులను తగ్గిస్తున్నాయి’ అని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios