ముంబై: దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్‌) తొలిసారి 50 వేల కోట్ల డాలర్ల మార్కును దాటాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ (ఆర్బీఐ) వివరాల ప్రకారం ఈ నెల 5 నాటికి దేశంలోని మొత్తం ఫారెక్స్‌ నిల్వలు 501.70 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

గత నెల 29 నాటికి 493.48 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అయితే వారం రోజుల్లో 8.22 బిలియన్‌ డాలర్లు పెరుగడంతో 500 బిలియన్‌ డాలర్లను అధిగమించాయి. అంతకుముందు వారం 3.44 బిలియన్‌ డాలర్లే పెరిగాయి. కాగా, విదేశీ కరెన్సీ ఆస్తుల్లో భారీ పెరుగుదలే ఇందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది.

దేశ ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధి బాట పట్టడానికి విదేశీ మారక ద్రవ్యం నిల్వలను తెలివిగా వినియోగించుకోవాలని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సూచించారు. 30 ఏళ్ల క్రితం దేశంలో ఫారెక్స్ నిల్వలు అడుగంటిపోయే స్థితికి చేరుకున్న ఆయన గుర్తు చేశారు. 

భారత విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 500 బిలియన్ల డాలర్ల వరకు వచ్చాయని, 17 నెలల పాటు దిగుమతులకు ఢోకా లేదని మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

30 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు భారత్ విదేశీ మారక ద్రవ్యం నిల్వల్లో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం కరోనా నెలకొల్పిన ఉత్పాత సమయంలో మనకు ధైర్యాన్ని పెంచే వార్త. మనదేశ సామర్థ్యాన్ని మరిచిపోవద్దన్నారు మహీంద్రా. 

also read పరోటాపై ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌...సోషల్ మీడియా వైరల్..

దేశాన్ని వ్రుద్ధి బాటలో పయనింపజేయడానికి ఈ నిధులు వాడాలని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫారెక్స్ నిల్వల విషయంలో రష్యా, దక్షిణ కొరియాలను భారత్ దాటేసింది. చైనా, జపాన్ తర్వాత మూడో స్థానంలో ఉన్నదని ఈ కథనం సారాంశం.

పడిపోయిన పసిడి నిల్వలు
మరోవైపు దేశంలోని బంగారం నిల్వలు పడిపోయినట్లు ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. ఈ నెల 5 నాటికి 32.352 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇది 329 మిలియన్‌ డాలర్లు తక్కువ. 

కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్దనున్న భారత అనుబంధ విదేశీ మారకపు నిల్వల ఆస్తులు కూడా జూన్‌ 5 నాటికి 10 మిలియన్‌ డాలర్లు ఎగిసి 1.44 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక మొత్తం ఫారెక్స్‌ నిల్వలు 120 మిలియన్‌ డాలర్లు ఎగబాకి 4.28 బిలియన్‌ డాలర్లను తాకాయి.