Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్‌ స్పెషల్ శ్లోకా మెహతా..: ముఖేశ్‌దే తుది నిర్ణయం

రిలయన్స్ వార్షిక సమావేశానికి ముఖేశ్ అంబానీ పెద్ద కోడలు కాబోయే శ్లోకా మెహతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 125 బిలియన్ల డాలర్లకు తమ ఆదాయం పెంచడమే లక్ష్యమని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు.

Ambani 'bahu' makes debut at RIL AGM

ముంబై: దేశంలోకెల్లా అతి పెద్ద బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటికి కాబోయే కోడలు శ్లోకా మెహతా ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గురువారం ముంబైలో జరిగిన రిలయన్స్ 41వ వార్షిక సమావేశానికి ఆమె కాబోయే అత్తామామ, భర్తతో కలిసి హాజరు కావడమే దీనికి కారణం. ఇక డివిడెండ్ల చెల్లింపు విషయమై వాటాదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ముఖేశ్ అంబానీ మాత్రమేనని ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. 

అంబానీ కుటుంబ సభ్యుల మధ్య శ్లోకా మెహతా


రిలయన్స్ వార్షిక సమావేశంలో శ్లోకా మెహతా ముకేశ్ చిన్న కుమారుడు, తనకు మరిది అనంత్ అంబానీ, ముకేశ్ తల్లి కోకిలాబేన్ అంబానీ మధ్య ముందు వరుసలో కూర్చున్నది. హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బాండ్, రెండో తరం జియో ఫోన్ తదితర కొత్త ప్రకటనలను చేస్తున్న ఆకాశ్, ముకేశ్ కూతురు ఇషా అంబానీల ప్రసంగాన్ని ఆసక్తిగా గమనించారు. ఈ ఏజీఎంకు ముకేశ్ కుటుంబ సభ్యులంతా కూడా కలిసిరాగా, ఆకాశ్, ఇషా  మాత్రం ప్రత్యేకంగా మరో కారులో రావడం గమనార్హం.

125 బిలియన్ డాలర్ల ఆదాయమే ముఖేశ్ అంబానీ లక్ష్యం


2025కల్లా ఆర్‌ఐఎల్ ఆదాయాన్ని 125 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ముకేశ్ అంబానీ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టిన ఆయన ఇందులో భాగంగానే కీలకమైన ఇంధనం, పెట్రోకెమికల్స్ వ్యాపారాలను బలోపేతం చేస్తూనే కొత్త వ్యాపారాలను ప్రారంభించే దిశగా అడుగులేస్తున్నారు. తద్వారా సంస్థ రెవిన్యూ సామర్థ్యాన్ని ఇప్పటితో పోల్చితే రెట్టింపు చేయాలని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని సమావేశానికి హాజరైన వాటాదారులకు ముకేశ్ స్పష్టం చెప్పారు.

టెలికం, ఇంటర్నెట్ రంగాల్లో ముఖేశ్ దూకుడు


టెలికం, ఇంటర్నెట్ రంగాల్లో దూకుడు పెంచుతున్నామన్న ఆయన దేశవ్యాప్తంగా మొబైల్, బ్రాడ్‌బాండ్ సేవల విస్తరణార్థం ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు వివరించారు. త్వరలోనే ఇంటింటికి ఫైబర్ బ్రాడ్‌బాండ్ సేవలూ వస్తాయన్నారు. రిలయన్స్ రిటైల్ సైతం లాభదాయకంగా నడుస్తున్నదని, దీనికిప్పుడు 7,500 స్టోర్లున్నాయని ముకేశ్ వివరించారు. 35 కోట్ల మంది కస్టమర్లున్నట్లు చెప్పారు. ఇక 2022 నాటికి కేజీ-డీ6లోని శాటిలైట్ క్షేత్రాల నుంచి రోజుకు 30-35 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే దిశగా బ్రిటీష్ పెట్రోలియంతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు.

డిజిటల్ ఇండియా ఊసే ఎత్తని ముఖేశ్ అంబానీ


ఒక మోస్తరు డివిడెండ్లపై ఈసారి ఏజీఎంలో పలువురు షేర్‌హోల్డర్లు ప్రశ్నలు లేవనెత్తారు. వాటాదారులకు మెరుగైన రాబడులు అందించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని అంబానీ భరోసానిచ్చారు. ఈసారి అంబానీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ గురించి, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ పథకాలైన డిజిటల్‌ ఇండియా వంటి వాటి గురించి గానీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గత ఏజీఎంలో మోదీ డిజిటల్‌ ఇండియా గురించి అంబానీ పలుమార్లు ప్రస్తావించారు.  ఏజీఎం నేపథ్యంలో గురువారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు బీఎస్‌ఈలో 2.53 శాతం క్షీణించి రూ. 965 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios