Asianet News TeluguAsianet News Telugu

13 ఏళ్లలో ట్రిలియనీరుగా ముకేశ్ అంబానీ..కానీ ఆరేళ్లలోపే జెఫ్‌ బెజోస్‌ రికార్డు..

ప్రస్తుతం ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన 75వ వసంతంలో అడుగు పెట్టే నాటికి లక్ష కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపద సంపాదించిన పారిశ్రామిక ప్రముఖుల్లో ఒకరిగా నిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వచ్చే ఆరేళ్లలోనే ఆ రికార్డును చేరుకుంటారు. జెఫ్ బెజోస్.. తన మాజీ భార్యకు విడాకుల కోసం భారీగా భరణం చెల్లించినా ఆయన సంపద తగ్గక పోవడం గమనార్హం.
 

Amazon  Jeff Bezos may become world first trillionaire by 2026 : Mukesh Ambani by 2033
Author
Hyderabad, First Published May 16, 2020, 11:03 AM IST

న్యూఢిల్లీ: ఆసియా అపర కుబేరుడిగా కొనసాగుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 2033కల్లా.. అంటే తన 75వ వసంతంలో ట్రిలియనీర్ అవతారం ఎత్తుతారు. ఇక 2026 నాటికి  అమెజాన్ టాప్ బాస్ జెఫ్ బెజోస్  (56)  ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌‌గా రికార్డు నెలకొల్పనున్నారట.  62వ వసంతం నాటికి జెఫ్ బెజోస్‌ 1,000 బిలియన్లకు  పైగా నికర విలువను సాధించే అవకాశం ఉన్నదని కంపారిసన్ అధ్యయనం తెలిపింది.  

అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌అంబానీ 2033 నాటికి ట్రిలియనీర్‌ కావచ్చని అంచనా వేసింది. కంపారిసున్ ప్రకారం, ఈ ఘనత సాధించిన ప్రపంచంలో ఐదవ వ్యక్తిగా అంబానీ నిలవనున్నారు.


 అలాగే చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జు జియాయిన్ ప్రపంచంలో రెండవ ట్రిలియనీర్ కావచ్చని ఈ అధ్యయనం తేల్చింది. ఫోర్బ్స్ అందించిన అత్యంత విలువైన సంస్థల మార్కెట్ క్యాప్‌లను,  టాప్ 25 ధనవంతుల సంపదలను కంపారిసన్ విశ్లేషించింది. గత ఐదేళ్లలో నమోదు చేసిన  సంస్థల వార్షిక విస్తరణ, సగటు శాతంపై ఆధారపడి ఈ విశ్లేషించింది. 

also read గూగుల్ పే..ఆర్‌బిఐకి హైకోర్టు నోటీసు..యుపిఐ పేమెంట్ నిలిపివేయాలని పిటిషన్...

ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ బెజోస్‌ నికర విలువ గత ఐదేళ్లలో 34 శాతం ఎగిసి 143 బిలియన్ డాలర్లకు పెరిగిందని కంపారిసన్ వెల్లడించింది.  కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్‌, ‍హోమ్ డెలివరీల డిమాండ్ పెరిగినందున అమెజాన్ వ్యాపారం వచ్చే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.  

ప్రస్తుత సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అమెజాన్ 75 బిలియన్ డాలర్లకు పైగా అమ్మకాలు నమోదు చేసింది.  అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 60 బిలియన్ డాలర్లు. దీంతోపాటు కరోనా వైరస్‌ ఉధృతి, లాక్‌డౌన్  వరుస పొడిగింపులతో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

కాగా ప్రస్తుత ప్రపంచ సంక్షోభానికి ముందే, అమెజాన్ 2019లో 281 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. మరోవైపు  ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్ 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా అవతరించే ప్రణాళికలో వడివడిగా దూసుకుపోతున్నారు.  వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్‌లలో  మెగా పెట్టుబడులను సాధిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios