న్యూఢిల్లీ: నేతితో చేసే హాల్వా అంటే ఎవరికైనా నోరూరుతుంటూ ఉంటుంది. ఇళ్లలో సంతోషాన్ని పంచుకోవడానికి చేసేదే హాల్వా. ఈ హాల్వాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తయారు చేస్తారు. ప్రతియేటా పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు ‘బడ్జెట్ పత్రాల’ను ముద్రణ ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా హాల్వా తయారు చేస్తారు. ఈ హాల్వాను ఆర్థిక మంత్రిత్వశాఖ సిబ్బంది అందరికీ పంచుతారు.

Also read: మోదీ క్యాబినెట్‌లోకి బ్యాంకర్ కేవీ కామత్.. సురేశ్ ప్రభు కూడా

2020-21 ఆర్థిక సంవత్సరానికి సార్వత్రిక బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల ఒకటో తేదీన పార్లమెంట్‪లో సమర్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బడ్జెట్ పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందుగా హాల్వా తయారు చేస్తారు. ఈ దఫా హాల్వా తయారీ ప్రక్రియ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేపడతారు. 

నార్త్ బ్లాక్‌లో జరిగే హాల్వా తయారీ కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు ఆ శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ అధికారులు, క్లర్కులు పాల్గొంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా అధికారులు, సిబ్బందికి హాల్వా వడ్డిస్తారు. ఆ హాల్వా తయారీ ప్రక్రియతో బడ్జెట్ రూపకల్పన కీలక ఘట్టానికి చేరుకున్నట్లే. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

అయితే, నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వశాఖలో హాల్వా తయారు చేసిన తర్వాత ఆర్థికశాఖకు చెందిన సీనియర్ అధికారులు, సిబ్బంది ఇంటికి దూరం అవుతారు. ఫోన్ కనెక్షన్లు ఉండవు. అత్యవసర సమయాల్లో అధికారుల ముందే మాట్లాడాల్సి ఉంటుంది. వీరి కదలికలపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా కొనసాగుతుంది. పార్లమెంట్‌లో మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించిన తర్వాత వీరు ఇళ్లకు చేరుకుంటారు. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు లీక్ కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతారు.