న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకర్‌, 'బ్రిక్స్‌' బ్యాంక్‌ చైర్మన్‌ కేవీ కామత్‌ త్వరలో నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్‌లోకి రానున్నట్టు సమాచారం! త్వరలోనే ఆయనను ఆర్థికశాఖ సహాయమంత్రిగా తీసుకోబోతున్నారని ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

దేశీయంగా నెలకొన్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో కార్పొరేట్‌ వర్గాలకు మేలు చేకూర్చే మరిన్ని నిర్ణయాలు చేయాలన్న ఉద్దేశంతో కామత్‌ను కీలక స్థానంలో నియమిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ఇటీవల న్యూఢిల్లీలో ప్రీ బడ్జెట్‌ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. 

దేశ విదేశాలకు చెందిన బడా కార్పొరేట్‌ ప్రముఖులు, వారి ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా మాట్లాడారు. వారి అభిలాష మేరకు విధానపరమైన నిర్ణయాల కోసం కామత్‌లాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని నిర్ణయించుకున్నారని తెలిసింది. 

గతంలో కేవీ కామత్ ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు చైర్మన్‌గా పనిచేశారు. ఐసీఐసీఐ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌, ఎండీ, సీఈఒగా కూడా ఆయన వ్యవహరించారు.

ఒక ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత నమ్మకస్తుడు, కరుడుగట్టిన హిందూత్వవాది బీజేపీ రాజ్యసభ ఎంపీ స్వపన్‌ దాస్‌గుప్తాకు కూడా మోదీ క్యాబినెట్‌లో చోటుదక్క నున్నదని తెలుస్తున్నది. గుప్తాకు మానవ వనరులశాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారని సమాచారం. 

వర్సిటీల్లో వరుసగా జరుగుతున్న నిరసనలు మోడీ సర్కార్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడానికే స్వపన్‌ దాస్‌గుప్తాను తీసుకొస్తున్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. 

Also read:మందగమనం.. నిరుద్యోగం వెరసి ఉద్యోగాలు కుదిస్తున్న కార్పొరేట్లు

మరోవైపు గతంలో రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన సురేశ్‌ ప్రభు తిరిగి మోడీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలున్నాయి. వాజపేయి ప్రభుత్వంలో తొలుత క్యాబినెట్ మంత్రిగా పని చేసిన సురేశ్ ప్రభు గతంలో శివసేనకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తొలి విడుత క్యాబినెట్ విస్తరణ సందర్భంగా శివసేనను సంప్రదించకుండానే సురేశ్ ప్రభును మోదీ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. 

తొలుత రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేశ్ ప్రభు వరుస ప్రమాదాలతో ఆ శాఖ నుంచి తప్పుకున్నారు. మధ్యలో జరిగిన క్యాబినెట్ విస్తరణలో పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేశ్ ప్రభు.. స్థానే రైల్వేశాఖ మంత్రిగా పీయూష్ గోయల్ నియమితులయ్యారు.