Asianet News TeluguAsianet News Telugu

అమెరికా ప్రయాణానికి ‘‘5జీ ’’ బ్రేకులు.. సర్వీసులు రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా, భారతీయుల ఇక్కట్లు

5జీ టెక్నాలజీ (5g technology) కారణంగా అమెరికాలో (america) విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో 5జీ కమ్యూనికేషన్ల విస్తరణను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌ ఇండియా (air india) కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌ నుంచి అమెరికాకు నడిచే సర్వీసులను తగ్గించింది. 

Air India to curtail India US operations due to 5G roll out
Author
New Delhi, First Published Jan 19, 2022, 7:32 PM IST

5జీ టెక్నాలజీ (5g technology) కారణంగా అమెరికాలో (america) విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో 5జీ కమ్యూనికేషన్ల విస్తరణను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌ ఇండియా (air india) కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌ నుంచి అమెరికాకు నడిచే సర్వీసులను తగ్గించింది. ఇందులో భాగంగా కొన్ని సర్వీసులను రద్దు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో తెలియజేస్తామని ఎయిర్‌ ఇండియా బుధవారం ట్వీట్‌ చేసింది.  ప్రస్తుత 5G రోల్‌అవుట్ ప్లాన్ (5g rollout in us) విమానయానంపై ప్రభావం చూపే అవకాశం ఉందని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. 1.25 మిలియన్ల అమెరికా ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది.

కనీసం 15,000 విమానాలు, 40కిపైగా భారీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే వస్తువులు, సరుకు రవాణాను ప్రభావం చేస్తుందని పేర్కొంది. రన్‌వేల పక్కన అమర్చినప్పుడు 5జీ సిగ్నల్స్‌ పైలట్‌లు విమానం టేకాఫ్‌ చేయడానికి, ప్రతికూల వాతావరణంలో ల్యాండ్‌ చేయడానికి అవసరమయ్యే కీలకమైన భద్రతా పరికరాలకు ఆటంకం కలిగిస్తాయని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ (united airlines) వెల్లడించింది. భద్రతపై తాము రాజీపడమని స్పష్టం చేసింది. ఇతర దేశాలు 5జీ సాంకేతికతను సురక్షితంగా అమలు చేసేలా విధివిధానాలు విజయవంతంగా రూపొందించాయని పేర్కొంది. తాము సైతం అమెరికా ప్రభుత్వాన్ని అదే పని చేయాలని కోరుతున్నామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. 

5జీ కారణంగా అమెరికాలో పెద్ద సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు పలు ఎయిర్​లైన్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని వాయిదా వేశాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో భారతీయులు సైతం పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్, శాన్​ఫ్రాన్సిస్కో, షికాగో, నేవార్క్(న్యూజెర్సీ) నగరాలకు వెళ్లే విమానాల కార్యకలాపాలు నిలిచిపోయాయని ఎయిరిండియా తెలిపింది. అమెరికా రాజధాని వాషింగ్టన్​కు మాత్రం యథావిధిగా సర్వీసులు నడుస్తున్నాయని తెలిపింది. 

మరోవైపు, ఏవియేషన్ సంస్థల ఆందోళనలు, అమెరికా ప్రభుత్వం చేపట్టిన చర్యల నేపథ్యంలో.. 5జీ సేవల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ (at and t), వెరిజాన్ (verizon) ప్రకటించాయి. కొన్ని ఎయిర్​పోర్టుల వద్ద సర్వీసులను ప్రారంభించడం లేదని వెల్లడించాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios