న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎవరూ ఊహించని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఖరి నిమిషంలో బుక్ చేసుకునే విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 

ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షా  సమావేశంలో లాస్ట్ మినిట్ టికెట్లపై భారీ డిస్కౌంట్ అందించే నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ మార్గాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది. 

అయితే, వాస్తవానికి లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకునే టికెట్లు సాధారణంగా 40శాతం అధికంగా ఉంటాయి. కానీ, జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం, పలు విమానాల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. 

అందుబాటులో ఉన్న సీట్లలో లాస్ట్ మినిట్ బుకింగ్‌లపై 50శాతం తగ్గింపును వర్తింపజేయనుంది. ప్రయాణానికి మూడు గంటలలోపు బుక్ చేసుకుంటే ఈ తగ్గింపు వర్తిస్తుందని పీటీఐకి ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఎయిరిండియా కౌంటర్లు, ఎయిరిండియా వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌లతోపాటు ఏజెంట్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.