ముంబై: పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కొత్త వినియోగదార్ల నమోదును నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశాలే కారణమని సన్నిహిత వర్గాల కథనం. జూన్‌లో నెలలో ఆడిట్‌ జరిపిన తర్వాత ఆర్బీఐ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో జూన్‌ 20 నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ కొత్త వినియోగదార్ల నమోదును నిలిపినట్లు సమాచారం. ఇందుకు కారణం కొత్త వినియోగదార్ల నమోదులో కేవైసీ(మీ వినియోగదారు గురించి తెలుసుకో) నిబంధనలకు ఉల్లంఘించడమేనని ఆ నలుగురిలో ముగ్గురు పేర్కొన్నారు. తక్షణం కొత్త వినియోగదార్ల నమోదును నిలిపివేయాలని పేటీఎమ్‌ చెల్లింపుల బ్యాంకుకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసినట్లు అందులో ఒకరు చెప్పారు. కొత్త ఖాతాల ప్రక్రియ నిలవడంతో కరెంట్‌ ఖాతాలను తీసుకువచ్చే ప్రక్రియలో పేటీఎమ్‌ మార్పులు చేపడుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. 

బ్యాంకింగ్‌ సేవల సంస్థకు ఆధ్వర్యం వహించే సామర్థ్యంపై ఆర్‌బీఐ అభ్యంతరాలను వెలిబుచ్చడంతో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రేణు సత్తిని పేటీఎమ్‌ తొలగించినట్లు ఆ సంస్థ వర్గాల కథనం. ఏదైనా చెల్లింపుల బ్యాంకుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కావాలంటే.. ఒక బ్యాంకర్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఉండాలన్నది ఆర్బీఐ నిబంధన. దీన్ని పేటీఎమ్‌ ప్రతినిధి ఒకరు ఖండించారు. ‘ఇది తప్పు. రేణు సత్తి నియామకం ఆర్బీఐ అనుమతితోనే గతేడాది మే 19వ తేదీన జరిగింది’ అని పేర్కొన్నారు. పేటీఎమ్‌ చెల్లింపుల బ్యాంకు సీఈఓగా రేణు సత్తి తొలగుతున్నట్లు.. కంపెనీలోనే కొత్త బాధ్యతలు చేపడుతున్నట్లు పేటీఎమ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పేటీఎమ్‌ రిటైల్‌ వ్యాపారానికి సీఓఓగా వ్యవహరించనున్నారని అందులో పేర్కొంది. ప్రస్తుతానికి మాత్రం పేటీఎమ్‌ చెల్లింపుల బ్యాంకు సీఈఓ స్థానాన్ని ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. కొత్త ఖాతాదార్ల నమోదును నిలిపివేశారా లేదా అన్నదానిపై స్పందించడానికి పేటీఎమ్‌ ప్రతినిధి నిరాకరించారు.

ఖాతాదార్ల సమాచారాన్ని నిల్వ చేసే భద్రతా వ్యవస్థలను మరింత మెరుగ్గా ఉంచుకోవచ్చని పేటీఎం పేమెంట్ బ్యాంకును ఆర్బీఐ తన ఆడిట్‌లో తెలిపినట్లు సమాచారం. మాతృ సంస్థ ఒన్‌97 కమ్యూనికేషన్స్‌లో కాక విడిగా పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు కార్యాలయం ఉండాలని కూడా తెలిపింది. ఇటీవలే కంపెనీ తన పేటీఎమ్‌ చెల్లింపుల బృందాన్ని నోయిడాలోని కొత్త కార్యాలయానికి మార్చింది కూడా. ఈ విషయాలపై పంపిన ప్రశ్నలకు ఆర్‌బీఐ నుంచి ఇంకా సమాధానాలు రాలేదని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. 

పేటీఎమ్‌కు రెండు, మూడో శ్రేణి నగరాల నుంచి డిజిటల్‌ చెల్లింపుల ఖాతాలు పెరిగాయి. ఇపుడు మొత్తం ఖాతాల్లో అవే సగం ఉన్నాయి. దీంతో ఏటా 500 కోట్ల లావాదేవీలు, స్థూల లావాదేవీ విలువ 50 బిలియన్‌ డాలర్లకు చేరడానికి వీలైందని జులైలో పేటీఎమ్‌ తెలిపింది. 2017 జూన్‌లో కంపెనీ స్థూల లావాదేవీల విలువ ఒక బిలియన్‌ డాలర్లు మాత్రమే. స్థూల లావాదేవీ విలువలో రీఛార్జులు, బిల్లుల చెల్లింపులు, యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు, వాలెట్‌ లావాదేవీలు, పేటీఎమ్‌ మాల్‌ ద్వారా లేదా పేటీఎమ్‌ చెల్లింపుల గేట్‌వే ద్వారా జరిగే అన్ని కొనుగోళ్లు కలిసి ఉన్నాయి.

అయితే నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌) లేదా డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలను కలపలేదు. చెల్లింపుల బ్యాంకుల వ్యాపారం పెద్దగా ముందడుగు వేయకపోయినా.. నియంత్రణ సంస్థలు వీటిపై నుంచి దృష్టి మరల్చడం లేదు. తాత్కాలికంగా ఆధార్‌ ఆధారిత సిమ్‌ తనిఖీలను నిలపాల్సిందిగా భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను  డిసెంబరులో యూఐడీఏఐ ఆదేశించిన విషయం తెలిసిందే.