కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాలో వాటాల విక్రయానికి ప్రైవేట్ సంస్థలు బిడ్లను సమర్పించేందుకు గడువు మరోసారి పెంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బిడ్లు సమర్పించడానికి మార్చి 17వ తేదీ వరకు గడువు విధించారు. 

దీన్ని మరికొన్ని రోజులు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాల కథనం. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోని మంత్రుల ప్యానెల్ ఈ వారం భేటీ కానున్నది. ఈ భేటీలో కొత్త తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

రుణాల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎయిర్ఇండియా 100 శాతం వాటాలను విక్రయించడానికి కేంద్రం నిర్ణయించింది. 

ఆసక్తి గల బిడ్డర్ల నుంచి ఎక్స్‌ప్రెషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ జనవరి 27వ తేదీన కేంద్రం ప్రాథమిక సమాచార పత్రం జారీ చేసింది. వచ్చేనెల 17వ తేదీ వరకు బిడ్డర్లు తమ దరఖాస్తులు సమర్పించుకోవచ్చని తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఆశించిన మేరకు బిడ్లు రాకపోవడంతో గడువు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. 

ఇప్పటికే ప్రతిపాదిత వాటాలను విక్రయించే విషయమై నెలకొన్న సందేహాలను తీర్చుకోవడానికి గల గడువును ఈ నెల 11వ తేదీ వరకు గల గడువును మార్చి ఆరో తేదీ వరకు పొడిగించారు. 2019 మార్చి నెలాఖరు నాటికి ఎయర్ ఇండియా రూ.60 వేల కోట్ల రుణ భారాన్ని మోస్తోంది. 

అంతకుముందు ఎయిర్ ఇండియాను విక్రయించడానికి 2018లో ప్రభుత్వం ముందుకువచ్చింది. బిడ్డింగ్‌లో పెట్టిన నిబందనలతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఇంతకుముందు 76 శాతం వాటాలను విక్రయించడానికి ప్రయత్నించినా కొన్ని షరతులు విధించింది కేంద్రం. 

సంస్థ ఉద్యోగులను కొనసాగించాలని, పేరు మార్చవద్దని తదితర నిబంధనలు పెట్టింది. దీంతో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నిబంధనలను మరింత సరళీకరించి 100 శాతం వాటాల ఉపసంహరణకు సిద్ధమైంది. 

Also Read ఈ దశాబ్ది రిలయన్స్-మైక్రోసాఫ్ట్‌దే: ముకేశ్ అంబానీ

ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే సంస్థ మొండి బాకీల (ఎన్పీఏ) విలువను రూ.3500 కోట్లు ఉండాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మోదీ ప్రభుత్వ హయంలో ఇప్పటికే దేశంలోని ఆరు కీలక విమానాశ్రయాలను స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూపు.. తాజాగా ప్రభుత్వ రంగంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాను (ఏఐ) సొంతం చేసుకోనే దిశగా యోచిస్తున్నట్టు సమాచారం. 

ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ కొనుగోలు పోటీలో ఆ కంపెనీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు వచ్చే నెలలో ఆదానీ గ్రూప్ బిడ్‌లు దాఖలు చేయనున్నదని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు ఒక్కరు ఈ విషయాన్ని వెల్లడించారు. 

అదానీ గ్రూపుతో పాటు ఎయర్ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూపు, హిందూజా గ్రూపు, ఇండిగో, న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తున్న ఇంటరప్స్‌ సంస్థ ఆసక్తిగా ఉన్నాయి. ఎయిర్ఇండియాతోపాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరిండియా శాట్స్‌ ఎయిర్‌పోర్టు సర్వీసుల్లోనూ వాటాలను కేంద్రం విక్రయించనుంది. దీంతో అదానీ దృష్టి ఎయిరిండియాపై పడినట్టుగా తెలుస్తోంది. అయితే, దీనిపై స్పందించడానికి ఆదానీ గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు.