ప్రస్తుతానికి సేవలు నిలిచిపోయిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’లో పని చేస్తున్న పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వివిధ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. సంస్థకు చెంది సుమారు 600 మంది.. సుమారు మూడో వంతు పైలట్లు ఇతర సంస్థల్లో కొలువులు వెతుక్కున్నారు. 

జెట్ ఎయిర్వేస్ ను కాపాడేందుకు సర్కార్ చర్యలు వేస్ట్
జెట్ ఎయిర్వేస్ మనుగడ కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శతవిధాల ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కొద్ది నెలలుగా సంస్థ సంక్షోభంలో చిక్కుకున్నప్పటి నుంచి సుమారు 250 పైలట్లు రాజీనామా చేసి ఇతర సంస్థల్లో చేరిపోయారు. 

ఇలా 1350కి చేరిన జెట్ ఎయిర్వేస్ పైలట్లు
దీంతో జెట్ ఎయిర్వేస్ సంస్థలోని పైలట్ల సంఖ్య 1600 నుంచి 1350కి చేరుకున్నది. 250 మంది పైలట్లలో 100 మంది విదేశీ విమానయాన సంస్థలు ఖతార్ ఎయిర్వేస్, ఎమిరేట్స్, ఇథియోపియన్ ఎయిర్ లైన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ తదితర సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. 

ఇండిగోలో పైలట్ల నియామకంలో జెట్ ఎయిర్వేస్ కే ప్రాధాన్యం
ఇక లో కాస్ట్ ప్రైవేట్ క్యారియర్ ఇండిగో ‘బోయింగ్ 737 కమాండర్’ స్థాయి పైలట్లు 100 మందికి పైగా నియమించుకున్నది. వారిలో అత్యధికులు జెట్ ఎయిర్వేస్ పైలట్లే కావడం గమనార్హం.  తాజాగా టాటా-సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది. 

100 మంది పైలట్లను అక్కున చేర్చుకున్న విస్తారా
100-500 పైలట్లు, 400 మంది క్యాబిన్‌ సిబ్బందిని ఎంపిక చేసేందుకు విస్తారా ఇంటర్వ్యూలు చేపట్టింది. సంస్థ ప్రారంభమై మూడేళ్లు కావొస్తున్నా, ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడం ఇదే తొలిసారని విస్తారా యాజమాన్యం తెలిపింది. వీరిలో వంద మంది పైలట్లను విస్తారా నియమించుకున్నట్లు సమాచారం. 

అనుభవజ్నులైతే వెంటనే ఇలా సర్వీసుల్లోకి..
అయితే కొత్తవారిని ఎంపిక చేసి, వారికి నెలల పాటు శిక్షణ ఇచ్చి, విధుల్లోకి తీసుకోవడం సంస్థలకు వ్యయప్రయాసలతో కూడిన పని అనే చెప్పుకోవాలి.

మొన్నటి వరకూ జెట్‌ ఎయిర్‌వేస్‌లో విధులు నిర్వర్తించిన సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదని, వారిని నేరుగా విధుల్లోకి పంపించవచ్చని నిర్ధారించుకున్న తర్వాతే విస్తారా పెద్దసంఖ్యలో ఉద్యోగుల నియామకం చేపట్టింది. 

దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థ ‘విస్తారా’
జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం అని బాహాటంగానే చెప్పేసిందీ సంస్థ. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఏకకాలంలో గురుగ్రామ్‌, ముంబై నగరాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది.

ఇప్పటి వరకూ విస్తారా దేశవ్యాప్తంగా మాత్రమే విమాన సేవలందిస్తోంది. ఈ సిబ్బంది విధుల్లోకి చేరగానే అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. 

ఇలా స్పైస్ జెట్ ఆఫర్
ఇదే తరహాలో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 100 మంది పైలట్లు సహా 500 మంది సిబ్బందిని తమ సంస్థలోకి తీసుకోనున్నట్లు చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ ఇప్పటికే ప్రకటించింది.

మరోపక్క జెట్‌ చేతిలో ఉన్న 10 బోయింగ్‌ 777 భారీ విమానాల్లో ఐదింటిని తమకు లీజు ప్రాతిపదికన ఇవ్వాలని ఎయిర్‌ ఇండియా ఇదివరకే ఎస్బీఐ ఛైర్మన్‌కు లేఖ రాసింది. ఆ విమానాలు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ సేవలను మరింత విస్తరించే యోచనలో ఎయిర్‌ ఇండియా ఉంది. 

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ నియామక ప్రక్రియ ఇలా
మరోవైపు ఎయిర్ ఇండియా లో కాస్ట్ ఆర్మ్ ‘ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్’ తన బోయింగ్ 737 విమానాల కోసం 250 మంది జెట్ ఎయిర్వేస్ పైలట్ల నియామక ప్రక్రియ చేపట్టింది. అయితే వారిని కో- పైలట్లుగా కాంట్రాక్ట్ పద్దతిలో నియామకాలు చేపట్టాలని ఎయిరిండియా పైలట్ల సంఘం ‘ఇండియన్ పైలట్స్ గిల్డ్ (ఐపీజీ) సంస్థ యాజమాన్యానికి అప్పీల్ చేసింది. 

యాజమాన్య హక్కులు సొంతం చేసుకున్న బ్యాంకర్లు
ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో పెట్టుబడులు రాక, చేసిన అప్పులు తీర్చలేని స్థితికి చేరుకున్న జెట్ఎయిర్‌వేస్‌ చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు అప్పులిచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం యాజమాన్య హక్కులను సొంతం చేసుకున్నాయి. 

అంధకారంలో 20 వేల మంది సిబ్బంది భవితవ్యం
సిబ్బంది జీతాలకు, విమానాల ఇంధనానికి కూడా నిధులు సమకూరకపోవడంతో గతనెల 17 నుంచి విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జెట్‌ ఎయిర్వేస్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 1,300 మంది పైలెట్లు, 2000 మంది క్యాబిన్‌ క్రూ కలిపి మొత్తం 22,000 మంది సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

పాక్ ఆంక్షలతో ఎయిరిండియాకు 300కోట్ల నష్టం
పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన యుద్ధ విమానాల దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై పాక్‌ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లింది. 

ప్రత్యామ్నాయ మార్గాల్లో భారత్ విమానయాన సంస్థల సేవలు
పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో అమెరికా, యూరప్‌ వెళ్లేందుకు భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు ప్రయాణించే దూరం ఎక్కువగా ఉండటంతోపాటు సిబ్బంది వినియోగం కూడా పెరిగింది. దీంతో రోజుకు రూ. 6కోట్లు చొప్పున ఎయిరిండియా రూ. 300కోట్లకు పైగా నష్టపోయినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది.

సివిల్ ఏవియేషన్ శాఖ నుంచి నష్ట పరిహారం కోరిన ఎయిరిండియా
నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిరిండియా పౌర విమానయాన శాఖను ఆశ్రయించి నష్టపరిహారం కోరినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27 నుంచి పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది.

దీంతో దిల్లీ నుంచి అమెరికా వెళ్లే ఎయిరిండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గంలో మరో 2-3  గంటలు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. విమానం ప్రయాణించే సమయం పెరగడంతో అది సిబ్బంది పని గంటలపైనా ప్రభావం చూపుతోంది. పని ఒత్తిడి తగ్గించేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు ఎయిరిండియా తెలిపింది.