ముంబై: కార్పొరేట్ ఇండియా డోయెన్ ఆనంద్ మహీంద్రా.. మహీంద్రా అండ్ మహీంద్రాలో గట్టి సుపరిపాలనకు సుసంపన్న వారసత్వాన్ని నిర్మించారు. అంతే కాదు వచ్చే ఏడాది ఏప్రిల్ లో సంస్థ చైర్మన్‌గా వైదొలుగనున్న ఆనంద్ మహీంద్రా సంస్థ నాయకత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. వాహనాల తయారీ నుంచి పలు రంగాల్లోకి ఎంటరైన మహీంద్రా అండ్ మహీంద్రా మున్ముందు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం గల వ్రుత్తి నిపుణులకు నిలయం అని పేరొందిన ఆటో నిపుణులు తెలిపారు. 

ఎవరు ఏ స్థానంలో ఉన్నా చురుగ్గా సంస్థకు సారథ్యం వహించగల టీం మహీంద్రా అండ్ మహీంద్రా సొంతమని ఎచిర్ మోటార్స్ అండ్ టాటా కమ్యూనికేషన్స్ మాజీ చైర్మన్ సుబోధ్ భార్గవ పేర్కొన్నారు. 1955లో జన్మించిన ఆనంద్ మహీంద్రా.. లేట్ ఇండస్ట్రీయలిస్టు హరీశ్ మహీంద్రా, ఇంద్రా మహీంద్రాల ముద్దు బిడ్డ. ఆ కంపెనీకి మూడో తరం వారసుడు. కేసీ మహీంద్రా కూతురు ఇంద్రా మహీంద్రా కొడుకే ఈ ఆనంద్ మహీంద్రా.

also read ఆటో ఎక్స్‌పోకు డజనుకుపైగా కంపెనీలు డుమ్మా...కారణం ?

వ్యవసాయ పరికరాల తయారీ మొదలు సాఫ్ట్‌వేర్‌, ఏరోస్పేస్‌ వరకు పలు రంగాల్లో సత్తా చాటుకొంటూ 20.7 బిలియన్‌ డాలర్ల విలువను కలిగి ఉన్న మహీంద్రా గ్రూపునకు చైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా 2012 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సుదీర్ఘంగా 45 ఏళ్ల పాటు మహీంద్రా గ్రూపునకు సారథ్యం వహించిన తన మేనమామ కేశవ్ మహీంద్రా రిటైర్మెంట్‌ తర్వాత చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌ ఆ గ్రూపును మరింత ముందుకు తీసుకు వెళ్లారు.

ఆనంద్‌ హయాంలో మహీంద్రా గ్రూపు కార్యకలాపాలు దేశీయంగానే కాక అంతర్జాతీయ మార్కెట్లలో పలు రంగాలకు విస్తరించాయి. వీటిలో ఆటోమొబైల్స్‌, అగ్రికల్చర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఏరోస్పేస్‌ తదితర కీలక రంగాలు ఉన్నాయి.  ఆనంద్‌ హయాంలో మహీంద్రా గ్రూపు దేశ, విదేశాల్లో పలు సంస్థలను కొనుగోలు చేసింది.

వీటిలో శాంగ్యాంగ్‌ మోటర్స్‌, రేవా ఎలక్ట్రిక్‌ కార్‌ కంపెనీ, సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌, ప్యుగోట్‌ మోటర్‌సైకిల్స్‌, జిప్స్‌లాండ్‌ ఏరోనాటిక్స్‌, ఏరోస్టాఫ్‌ ఆస్ట్రేలియా, హాలిడే క్లబ్‌ రిసార్ట్స్‌, పినిన్ఫారినా స్పా తదితర సంస్థలు ఉన్నాయి. హార్వర్డ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం 1981లో మహీంద్రా గ్రూప్‌లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 

తాజాగా సంస్థ తీసుకున్న నాయకత్వ మార్పుల్లో భాగంగా ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) పదవిని కల్పించారు. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఈమధ్యే చేజిక్కించుకున్న ఫోర్డ్‌ ఇండియా కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఎం అండ్‌ ఎం కొత్తగా సీఈఓ పదవిని సృష్టించినట్లు తెలుస్తోంది. దీనికి సంస్థ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా సీఈఓగా అదనపు బాధ్యతలు వహించనుండటం గమనార్హం. 

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా త్వరలో మహీంద్రా గ్రూపు చైర్మన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు శుక్రవారం ఆ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. భవిష్యత్‌లో ఆనంద్‌ మహీంద్రా తమ సంస్థకు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఈ నాయకత్వ మార్పు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని మహీంద్రా గ్రూపు వెల్లడించింది. 

‘మా సంస్థ భవిష్యత్‌ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని గవర్నెన్స్‌, నామినేషన్‌, రెమ్యునరేషన్‌ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఆనంద్‌ మహీంద్రాను ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతల నుంచి తొలిగించి 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఆయనను నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించాం మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) మార్గదర్శకాల మేరకు తీసుకొన్న ఈ నిర్ణయాన్ని శుక్రవారం జరిగిన మా కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోదించింది’ అని మహీంద్రా గ్రూపు స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.

నాయకత్వ మార్పిడిలో భాగంగా ప్రస్తుతం కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా వ్యవహరిస్తున్న పవన్‌కుమార్‌ గొయెంకా ఆ బాధ్యతలతోపాటు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా అదనపు బాధ్యతలు చేపడతారని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఏడాదిపాటు అంటే 2021 ఏప్రిల్‌ 1 వరకు  ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొన్నది. 

ప్రస్తుతం తమ గ్రూపులో స్ట్రాటజీ విభాగ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న అనీష్‌షా వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి 2021 ఏప్రిల్‌ 1వరకు వీఎస్‌ పార్థసారథి స్థానంలో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)గా బాధ్యతలు నిర్వర్తిస్తారని, అంతేకాకుండా అనీష్‌షా 2020 ఏప్రిల్‌ 1 నుంచి కంపెనీ అదనపు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తారని వివరించింది.

also read ఇండియాలో..క్యూ కడుతున్న చైనా కార్ల కంపెనీలు...ఎందుకంటే ?
 
2021 ఏప్రిల్‌ 1న పవన్ గొయెంకా రిటైర్‌ అవుతారని, దీంతో ఆ మరుసటి నాడు (2021 ఏప్రిల్‌ 2న) అనీష్‌షా మహీంద్రా గ్రూపు ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడుతారని తెలిపింది. సీపీ గుర్నానీని 2020 ఏప్రిల్‌ 1 నుంచి తమ సంస్థ తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే వరకు అదనపు డైరెక్టర్‌గా నియమిస్తామని, ఆయన నాన్‌-ఎగ్జిక్యూటివ్‌, నాన్‌-ఇండిపెండెండ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని మహీంద్రా గ్రూపు తెలిపింది.

కంపెనీ వ్యవసాయ యంత్రాల విభాగ అధిపతి రాజేశ్‌ జెజురికర్‌ కూడా బోర్డులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆటో అండ్‌ ఫార్మ్‌ సెక్టార్‌)గా చేరనున్నారు. గ్రూపు హెచ్‌ఆర్‌, కార్పొరేట్‌ సేవల విభాగాల అధిపతి, ఆఫ్టర్‌ మార్కెట్‌ విభాగ సీఈఓ రాజీవ్‌ దూబే వచ్చే ఏప్రిల్‌ 1న రిటైర్‌ కానున్నారు. అయితే, సలహాదారుగా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాలో ఆయన గ్రూప్‌లో కొనసాగనున్నారు. రజ్బే ఇరానీ ఇకపై గ్రూప్‌ హెచ్‌ఆర్‌, కమ్యూనికేషన్స్‌, సీఎ్‌సఆర్‌, ఎథిక్స్‌, సీఐఎస్‌ విభాగాలకు నేతృత్వం వహించనున్నారు.


నాయకత్వ మార్పిడి విషయమై మహీంద్రా గ్రూపు తాజాగా తీసుకొన్న నిర్ణయాలతో తమ సంస్థలో యాజమాన్య ప్రతిభకు కొదువలేదని ఆనంద్ మహీంద్రా చెప్పారు.  విలువలకు, సమర్థతకు భవిష్యత్‌లోనూ పెద్దపీట వేయనున్నట్టు సుస్పష్టం చేస్తున్నాయని ఆనంద్‌ తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవి నుంచి వైదొలిగిన తర్వాత సంస్థకు మార్గనిర్దేశకుడిగా కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తానని, సంస్థ విలువలకు సంరక్షకుడిగా, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షకుడిగా వ్యవహరిస్తానని ఆనంద్ మహీంద్రా చెప్పారు.

మరోవైపు మహీంద్రా వాహనాల్లో అత్యంత విజయవంతమైన ‘స్కార్పియో’ అభివృద్ధిలో పవన్ గొయెంకా పాత్ర కీలకమైనది. జనరల్‌ మోటర్స్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌లో పనిచేసిన తర్వాత 1993లో మహీంద్రా అండ్ మహీంద్రాలో (ఎంఅండ్‌ఎం)లో ఆర్‌ అండ్‌ డీ జీఎంగా చేరిన గొయెంకా అంచెలంచెలుగా ఎదిగి 2016 నవంబర్‌లో ఎండీగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగంలో పలు హోదాల్లో పని చేశారు. 2015 ఏప్రిల్‌లో ఏఎఫ్‌ఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.