ఇండియాలో..క్యూ కడుతున్న చైనా కార్ల కంపెనీలు...ఎందుకంటే ?
భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా కార్ల తయారీ సంస్థలు గ్రేట్ వాల్ మోటార్స్, చంగన్ మోటార్స్ తదితర సంస్థలు వ్యూహ రచన చేస్తున్నాయి. ప్రస్తుతానికి భారతదేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా.. మున్ముందు పుంజుకుంటుందన్న ముందుచూపుతో చైనా కార్ల తయారీ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఎన్నో అవకాశాలకు నెలవైన ఇండియా మార్కెట్‌కు రావడానికి చైనాలోని ప్రముఖ ఆటో కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. గ్రేట్ వాల్ మోటర్, చాంగన్ ఆటోమొబైల్ వంటి కంపెనీలు ఇండియా బాట పట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎస్‌ఏఐసీ మోటర్ వంటి తమ ప్రత్యర్థి సంస్థలు భారతదేశంలో సక్సెస్ కావడంతో ఇవి ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తున్నాయి.
చైనాలో అత్యధికంగా ఎస్‌యూవీ కార్లను అమ్మే కంపెనీల్లో ఒకటైన గ్రేట్ వాల్ వచ్చే ఏడాది జూన్‌లోపే మహారాష్ట్రలో ప్లాంట్‌ను మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా నుంచి జనరల్ మోటార్స్ వెళ్లిపోయాక, మహారాష్ట్రలోని ఖాళీగా ఉన్న దాని ప్లాంట్ గ్రేట్ వాల్ కొనే అవకాశాలు ఉన్నాయి.
also read మారుతి, ఫోర్డ్, రెనాల్ట్ కార్లకు పోటీగా హ్యుండాయ్ కొత్త కారు...
కొత్తగా అన్ని అనుమతులూ తీసుకొని, ఫ్యాక్టరీ పెట్టడం కంటే అందుబాటులో ఉన్న ప్లాంట్‌ను చేజిక్కించుకోవడం మేలన్నది ఈ కంపెనీ ఆలోచన. ఇందులో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేస్తారని, వచ్చే నెలే అధికారికంగా ప్రకటన కూడా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ విషయమై జనరల్ మోటార్స్ సీనియర్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ మహారాష్ట్రలోని తలెగావ్‌లోని తమ ప్లాంట్లో తయారయ్యే వాహనాల ఎగుమతులను కొనసాగిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీని గ్రేట్‌వాల్‌కు అమ్మేసే విషయమై స్పందించలేమని జనరల్ మోటార్స్ అధికారి చెప్పారు.
గ్రేట్‌వాల్‌తోపాటు చాంగన్ భారతదేశంలో ఉత్పత్తి కోసం ణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కొందరు సప్లయర్లతో మాట్లాడింది కూడా. ఈ రెండు చైనా కంపెనీలూ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను తయారు చేస్తాయి. ఇండియాలోనూ ఈవీ బ్యాటరీ అసెంబ్లీ ప్లాంట్లను పెట్టాలా ? అనే ప్రతిపాదనలను కూడా స్టడీ చేస్తున్నాయి. ఈ విషయమై స్పందించడానికి చాంగన్ తిరస్కరించింది.
చైనాలో ఆటోమొబైల్ పరిశ్రమ నెమ్మదిస్తోంది. గత నెల అమ్మకాల్లో 17 నెలల కనిష్టానికి పడిపోయాయి. నిజానికి ఇండియాలోనూ కార్ల అమ్మకాలు అంతంతమాత్రమే. అయితే 2026 నాటికి మనదేశం ప్రపంచంలోనే మూడోఅతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికైతే ఆటోమొబైల్ రంగంలో మొదటిస్థానంలో అమెరికా, రెండోస్థానంలో చైనా ఉంటుందని ఎల్‌ఎంసీ ఆటోమోటివ్ స్టడీ తెలిపింది. ఫియల్ క్రిస్లర్, ఫోర్డ్ మోటార్, జనరల్ మోటార్స్ ఇండియా మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయాయి. ఫలితంగా మార్కెట్లో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి చైనా కంపెనీలు రెడీ అవుతున్నాయి.
‘ప్రస్తుతం మారుతి, హ్యుండై వంటి కంపెనీల హవా నడుస్తోంది. చైనా కంపెనీలు ఇండియాకు రావడానికి ఇది మంచి సమయం’’ అని ఎల్‌ఎంసీ ఆటోమోటివ్ తెలిపింది. జనరల్ మోటార్స్ 2017 నుంచి ఇండియాలో కార్లను అమ్మడం మానేసింది. గుజరాత్‌లోని ప్లాంటును చైనా ప్రభుత్వ ఆటో కంపెనీ ఎస్‌ఏఐసీకి అమ్మేసింది. ఎస్‌ఏఐసీ ఇక్కడ హెక్టర్ ఎస్‌యూవీ చేస్తోంది. దీనిని ఎంజీ మోటార్ బ్రాండ్ పేరిట విడుదల చేసింది.
also read టాటా నుండి కొత్త వర్షన్ కారు ... దీని ధర ఎంతంటే..?
దీనికి కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో మిగతా చైనా ఆటో కంపెనీల దృష్టి ఇండియావైపునకు మళ్లింది. గ్రేట్‌వాల్.. ఇండియాతోపాటు దక్షిణ అమెరికా, సౌతాఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియాలోనూ అడుగుపెట్టాలని గ్రేట్ వాల్ కోరుకుంటోంది. యూరప్, అమెరికా నుంచి ఎగుమతులు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
గ్రేట్‌వాల్‌కు.. మహారాష్ట్ర ప్లాంటు.. చైనా తరువాత అతిపెద్ద ఫ్యాక్టరీ అవుతుంది. ఇండియాలో కార్యకలాపాల కోసం ఇది మారుతీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ను నియమించుకుంది. ఎస్‌ఏఐసీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ను ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ఉపయోగించుకుంటోంది. చైనా కంపెనీలకు ఇండియా చాలా కీలక మార్కెట్ కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా ఉండొచ్చని ఆటో రంగ నిపుణులు అంటున్నారు.
ఇండియన్లకు చైనా వస్తువుల క్వాలిటీపై చిన్నచూపు ఉంది. వాటిపై ఆధారపడలేమని చాలా మంది అనుకుంటారు. ఇలాంటి సమస్యలను చైనా కంపెనీలు అధిగమిస్తే సక్సెస్ సాధించవచ్చని చెబుతున్నారు.