న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాలు ఎగవేసి, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ముద్ర వేయించుకున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా భారత ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సీబీఐ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో భారతదేశంలోని తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు. తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం న్యాయమా? కాదా? అంటూ ఆయన వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. 

బ్యాంకుల కన్సార్టియం తరఫున రూ. 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నా కంపెనీ గ్రూపు ఆస్తులను డీఆర్టీ రికవరీ అధికరులు ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులను రూ.9,000 కోట్లు నేను నష్టపరచినట్లు నాపై అభియోగం మోపారు. ఇందులో న్యాయం ఎక్కడుంది? ఇది సబబేనా?’ అని తొలి ట్వీట్ చేశారు.

తన మరో ఆస్తిని డీఆర్టీ రికవరీ అధికారి స్వాధీనం చేసుకున్నారన్న వార్తతో తనకు తెల్లారుతున్నదని, స్వాధీనం చేసుకున్న నా ఆస్తుల విలువ రూ.13,000 కోట్లు ఇప్పటికే దాటిపోయిందని మరో ట్వీట్లో పేర్కొన్నారు. వడ్డీలన్నీ కలుపుకుని తాను బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయి రూ.9,000 కోట్లని చెబుతున్నాయని గుర్తు చేశారు. ‘ఇంకా ఎన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు..దీని అంతు ఎక్కడ? ఇది న్యాయమేనా?’ అంటూ ఆయన మరో ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశంలో అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నా తనపైన లెక్కలేనన్న పిటిపిషన్లు వేయడానికి ఇండియన్ బ్యాంకులు ఇంగ్లండ్‌లోని తమ న్యాయవాదులకు అనుమతులు మంజూరు చేశాయమని, ఇంత దారుణంగా ప్రభుత్వ సొమ్మును లీగల్ ఫీజుల కింద ఖర్చు చేస్తుంటే ఎవరు జవాబుదారీ అంటూ మరో ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.

‘అయినా ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాను రూ.9,000 కోట్లు ఎగవేసి పారిపోయానని చెబుతున్నారు. న్యాయం ఎక్కడుంది? ఇది సరైన చర్యేనా?’ అని ట్వీట్‌ చేశారు. తన నుంచి రుణాల వసూలు పేరుతో భారతీయ బ్యాంకులు లాయర్ల ఖర్చుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్నీ మాల్యా తప్పు పట్టారు. ఇందుకు ఎవరు జవాబుదారీ?అని ప్రశ్నించారు. ఇవే బ్యాంకుల లాయర్లు, బ్రిటన్‌లో తన లాయర్ల కోసం ఖర్చు చేస్తున్న ఫీజులను ప్రశ్నించడాన్నీ మాల్యా తప్పు పట్టారు.