లండన్: దేశంలోని బ్యాంకులకు సుమారు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా సరికొత్త వాదన వినిపిస్తున్నారు. తాను ఏ దేశం జైలులో ఉన్నా.. తాను చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. తాను 100శాతం సొమ్ము తిరిగి చెల్లిస్తానన్నా.. బ్యాంకులు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

కింగ్ ఫిషర్‌లో నేను భారీ పెట్టుబడులు పెట్టాను, కొద్ది కాలంలోనే ఎయిర్ లైన్స్ వేగంగా అభివృద్ధి చెంది దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం నిజమే. అయితే వాటిని 100శాతం తిరిగిస్తానని చెప్పినా.. బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇంకా నాపై నేరాభియోగాలు వేస్తున్నారు. ఇది ఎయిర్ లైన్ ఖర్మ అంటూ మాల్యా తన ఆవేదనను వెల్లబుచ్చారు. 

తాను బ్యాంకులకు రుణాలు చెల్లిస్తానని చెప్పినప్పుడల్లా.. మీడియా తనను భారత్‌కు అప్పగించే విషయం గురించి మాట్లాడుతోంద్నారు. తాను లండన్‌లో ఉన్నా.. ఇండియాలోని జైల్లో ఉన్నా రుణాలు మొత్తం చెల్లిస్తానని మాల్యా చెప్పుకొచ్చారు. రుణాలు చెల్లిస్తానన్నా బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదు? అని మాల్యా ప్రశ్నించారు. 

ఇది ఇలావుంటే, రుణ సంక్షోభంలో కూరుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితిపై విజయ్ మాల్యా విచారం వ్యక్తం చేశారు. తమకు పోటీదారుడే అయినప్పటికీ అంటూ.. ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకులైన నరేశ్ గోయల్, నీతా గోయల్‌కు మాల్యా సానుభూతి తెలిపారు. 

 

జెట్ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. ప్రైవేటు సంస్థలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని అన్నారు. మనదేశంలోనే ప్రైవేటు ఎయిర్‌లైన్స్ సంస్థల పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

 

‘ఒకప్పుడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు జెట్ ఎయిర్‌వేస్ గట్టి పోటీ ఇచ్చింది. అలాంటి పెద్ద ప్రైవేటు ఎయిర్‌లైన్స్ నేడు ఈ పరిస్థితికి రావడం బాధాకరం. ప్రైవేటు రంగ విమానయాన సంస్థ అన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. అదే అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను కాపాడేందుకు రూ. 35వేల కోట్లు ఉపయోగించింది. ప్రైవేటు సంస్థలపై ఇలా వివక్ష ఎందుకు?’ అని మాల్యా నిలదీశారు.