Asianet News TeluguAsianet News Telugu

విదేశాల్లో బ్లాక్ మనీ విలువ రూ.34 లక్షల కోట్లు

దేశంలో ఆర్థిక సంస్కరణల పర్వం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు విదేశాలకు తరలి వెళ్లిన భారతీయుల నల్లధనం 34 లక్షల కోట్లు అని ప్రాథమికంగా నిర్ధారణైంది. ఈ మొత్తం 1980-2010 మధ్య విదేశాలకు తరలి వెళ్లిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మూడు కమిటీలు నిర్వహించిన వేర్వేరు అధ్యయనాల్లో తేలింది. ఈ మూడు నివేదికలను సోమవారం లోక్ సభ ఫైనాన్స్ కమిటీ ముందు ప్రవేశ పెట్టారు. 
 

$490bn in black money stashed abroad by Indians: Report
Author
New Delhi, First Published Jun 25, 2019, 10:19 AM IST

న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో, సంస్థల్లో భారతీయులు దాచిన నల్లధనం విలువ రూ.15 లక్షల కోట నుంచి రూ.34 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని మూడు సర్వేలు తెలిపాయి. ఈ సొమ్ము 1980-2010 మధ్య దేశ సరిహద్దులను దాటిందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. విదేశాల్లో భారతీయుల నల్లధనంపై ఎన్‌ఐపీఎఫ్‌పీ, ఎన్‌సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎం సంస్థలు విడివిడిగా సర్వే చేసి నివేదికలు రూపొందించాయి. 

‘దేశం లోపల, విదేశాల్లో నల్లధనం స్థితిగతులు- ఒక సునిశిత విశ్లేషణ’ పేరుతో ఈ నివేదికలు లోక్‌సభ ఫైనాన్స్ కమిటీ ముందుకు వచ్చాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మా, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, బులియన్, పసిడి, సినిమా, విద్యారంగాల నుంచే ఎక్కువగా నల్లధనం ఉత్పత్తి అవుతున్నదని ఆ నివేదికలు పేర్కొన్నాయి.

ఇవన్నీ అంచనాలేనని, నల్లధనం ఎంత మొత్తం పోగవుతున్నదో కచ్చితంగా చెప్పే విధానాలు ప్రస్తుతం అందుబాటులో లేవని, వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వాటి విశ్లేషణతోనే ఈ లెక్క లు రూపొందించామని ఆ సంస్థలు తెలిపాయి.  దేశంలో, విదేశాల్లో పోగైన నల్లధనాన్ని లెక్కించాలని కేంద్రం 2011 మార్చిలో ఈ మూడు సంస్థలను కోరింది. 

ఈ మేరకు ఆయా సంస్థలు అధ్యయనం చేసి కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మెయిలీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి నివేదికలు సమర్పించాయి. కమిటీ ఈ నివేదికలను ఈ ఏడాది మార్చి 28న స్పీకర్‌కు సమర్పించింది. అయితే 16వ లోక్‌సభ గడువు పూర్తి కావడంతో ఈ నివేదికలపై చర్చ జరుగలేదు. తాజాగా 17వ లోక్‌సభ తొలి సమావేశాలు జరుగుతుండటంతో ఈ నివేదికలు లోక్‌సభ ఫైనాన్స్ కమిటీ ముందుకు వచ్చాయి. 

దేశం లోపల, వెలుపల పోగైన నల్లధనాన్ని లెక్కించడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఈ 3 సంస్థలు విస్తృత అధ్యయనంతో అంచనాలు రూపొందించాయి. నల్లధనం లెక్కింపులో కచ్చితమైన విధానాలు లేనందున మూడు నివేదికల్లో ఒకే అంకెలు ఉండటం అసాధ్యం అని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. 

ఈ నివేదికల ఆధారంగా విచారణ చేపట్టామని, సమయం తక్కువగా ఉన్నందున నిందితుల్లో కొంతమంది మాత్రమే ప్రశ్నించినట్టు తెలిపింది. దీనిని ప్రాథమిక నివేదికగా భావించాలని, మిగతా విచారణను ఆర్థిక శాఖ పూర్తిచేయాలని సూచించింది. ఈ క్రమంలో మూడు సంస్థల నివేదికలతోపాటు నల్లధనంపై నియమించిన ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాల నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది. 

నల్లధనాన్ని వెనక్కి రప్పించి ప్రస్తుతం అమలులో ఉన్న పన్నులతోపాటు ప్రత్యేక పన్నులు విధిస్తే సత్ఫలితాలు వస్తాయన్నది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నూతన ప్రత్యక్ష పన్నుల విధానానికి తుదిరూపునిచ్చి చట్టంగా మార్చి.. పాత చట్టంలో ఉన్న సంక్లిష్టతలను తొలిగించాలని సూచించింది.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) అంచనా ప్రకారం 1980-2010 మధ్య భారత్ వెలుపల పోగయిన నల్లధనం విలువ రూ.26 లక్షల కోట్ల నుంచి రూ.34 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎం) అధ్యయనం ప్రకారం 1990-2008 మధ్య సరిహద్దు దాటిన నల్లధనం విలువ దాదాపు 21,648 కోట్ల డాలర్లు ఉండొచ్చునని తెలుస్తోంది.

2008 నాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువతో పోలిస్తే రూ.9.41 లక్షల కోట్లు. ప్రస్తుతం రూ.15 లక్షల కోట్లు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) ప్రకారం 1997- 2009 మధ్య ఏటా దేశ జీడీపీలో 0.2 శాతం నుంచి 7.4 శాతంతో సమానమైన సొమ్ము విదేశాలకు తరలి వెళ్లింది.

లెక్కలు చూపని దాదాపు రూ.12,260 కోట్ల ఆస్తులపై నమోదైన 380 కేసుల్లో ఆదాయం పన్ను శాఖ నోటీసులు జారీ చేసిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం లోక్‌సభలో సభ్యులడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విదేశీ నల్లధనం చట్టం కింద ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిపారు. వీటిలో 68 కేసుల్లో ప్రాసిక్యూషన్ కూడా ప్రారంభమైందన్నారు.

నల్లధనం (వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్ను చట్టం విధింపు-2015 ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఐటీశాఖ 380 కేసుల్లో నోటీసులు జారీ చేసింది. వీటి విలువ దాదాపు రూ.12,260 కోట్లు అని పేర్కొన్నారు. నల్లధనం కలిగి ఉన్న వాళ్లపై సోదాలు, విచారణలు, ఆదాయం అంచనా, పన్ను/వడ్డీ/జరిమానా విధించడం వంటి చర్యలను తీసుకున్నట్టు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios