Budget2024: మనం ప్రపంచానికి దారి చూపాం.. మిడిల్ ఈస్ట్ కారిడార్ చరిత్రలో నిలుస్తుంది: నిర్మల సీతారామన్
కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ దేశాలు మందగమనంతో ఉండగా మన దేశం మాత్రం ముందుకు సాగిందని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు. ప్రపంచానికి దారి చూపించామని తెలిపారు. మిడిల్ ఈస్ట్ కారిడార్ గురించీ ప్రస్తావించారు.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ 2024లో ఆమె కీలక విషయాలను ప్రస్తావించారు. కరోనా అనంతరం ప్రపంచమంతా ఆర్థికంగా కుంగిపోతే.. మన దేశం మాత్రం గాడి తప్పలేదని తెలిపారు. ప్రపంచానికే దారి చూపిందని వివరించారు. చాలా క్లిష్టమైన సమయంలో భారత్ జీ20 సదస్సు మన దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిచిందని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో భారత్ - మిడిల్ ఈస్ట్ - యూరప్‌లను కలిపే ఎకనామిక్ కారిడార్‌ను ప్రస్తావించారు. ఈ కారిడార్ వచ్చే వందల సంవత్సరాల్లో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కారిడార్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచంలోనే అధిక భాగం వాణిజ్యం ఈ కారిడార్ గుండానే సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కారిడార్‌కు భారత్‌లోనే బీజం పడిందని చరిత్రలో నిలిచిపోతుందని వివరించారు.
కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణించిందని, వాణిజ్యలోటు ఏర్పడిందని, ద్రవ్యోల్బణం పెరిగిందని, ఆర్థికంగా బలహీనపడిందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ సందర్భంలోనూ మన దేశం వెనుకడుగు వేయలేదని వివరించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత వరల్డ్ ఆర్డర్ మారుతున్నదని, కొత్త దేశాలకూ ప్రాధాన్యత పెరుగుతున్నదని తెలిపారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో మన దేశం ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. అలాంటి సమయంలోనే భారత్ జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని, జీ20 అధ్యక్షత బాధ్యతలు తీసుకుందని వివరించారు. ప్రపంచ దేశాల్లోని సమస్యలకు భారత్ పరిష్కార మార్గాలు చూపిందని వివరించారు.
Also Read: G20 Summit: భారత్‌కు యూరప్‌ను మరింత చేరువ చేసే మధ్యాసియా ట్రేడ్-టెక్ కారిడార్.. కీలక విషయాలు ఇవే
ఈ కారిడార్ గురించి..
ఈ ప్రాజెక్టును మిడిల్ ఈస్ట్ ట్రేడ్ టెక్ కారిడార్ అని పిలుస్తున్నారు. వయా సౌదీ అరేబియా ద్వారా ఈ ప్రాజెక్టు మనకు యూరప్ దేశాలను మరింత చేరువకు తీసుకురానుంది. మన దేశం నుంచి యూరప్‌కు 72 గంటల్లో షిప్పింగ్ పూర్తయ్యేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు.
మన దేశం నుంచి ప్రమాణాత్మక కంటైనర్లు భారత్ నుంచి యూఏఈకి చెందిన ఫుజైరా పోర్టుకు చేరుతాయి. అక్కడి నుంచి జోర్డాన్ గుండా ఇజ్రాయెల్‌కు చెందిన హైఫా పోర్టు వరకు సుమారు 2650 కిలోమీటర్ల దూరం ఈ గూడ్స్ రైల్ రోడ్ మార్గాల్లో వెళ్లుతుంది. యూఏఈ నుంచి జోర్డాన్‌ల మధ్య ఇప్పటికి 1,850 కిలోమీటర్ల దూరం రైల్ రోడ్డు నిర్మాణం ఉన్నది. మిగిలిన భాగాలను నిర్మించి పూర్తి చేయాలని సౌదీ అరేబియా ప్రణాళికలు వేస్తున్నది. హైఫా పోర్టు నుంచి యూరప్ దేశాలకు సులువుగా వెళ్లవచ్చు. చాలా సమీపం కూడా. తద్వార భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచీ గూడ్స్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలోని పోర్టులకు షిప్పింగ్ తక్కువ దూరం(ప్రస్తుత మార్గంతో పోలిస్తే)తో సాధ్యమవుతుంది.