Union Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్ ప్రసంగాన్ని రేపు(శనివారం) పార్లమెంట్ లో చేయనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె షెడ్యూల్ ఎలా ఉంటుందో చూద్దాం.
Budget 2025 : ఫిబ్రవరి 1, 2025 అంటే రేపు శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి దేశ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇలా ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేేశపెట్టబోతున్నారు. తన బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలతో పాటు దేశ స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను ఆమె వివరిస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆమె బడ్జెట్ ప్రసంగంపై అందరి దృష్టి ఉంది... ప్రతి వర్గానికి ఆశలు ఉన్నాయి.
అయితే బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె బిజీబిజీగా గడుపుతారు. ఇలా బడ్జెట్ రోజ్ ఆమె రోజు ఎలా గడుస్తుందో చూద్దాం.
బడ్జెట్ రోజున నిర్మలా సీతారామన్ షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. మాజీ ప్రధాని, ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధిక బడ్జెట్‌లను ప్రతిపాదించిన ఆర్థిక మంత్రిగా ఆమె నిలుస్తారు. మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్‌లను ప్రతిపాదించారు. 1959-1964 వరకు ఆర్థిక మంత్రిగా 6 బడ్జెట్‌లు, 1967-1969 వరకు 4 బడ్జెట్‌లను మొరాార్జీ దేశాయ్ ప్రతిపాదించారు. 2019లో సీతారామన్ దేశంలో మొదటి పూర్తికాల ఆర్థిక మంత్రి అయ్యారు. అప్పటి నుండి ఆమె 7 బడ్జెట్‌లను ప్రతిపాదించారు. 2025 ఫిబ్రవరి 1న ఆమె 8వ బడ్జెట్ ప్రతిపాదిస్తారు.
రేపు(శనివారం)ఉదయం 8.40 గంటలకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుండి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం 9 గంటలకు ఆమె తన బడ్జెట్ బృందంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెలుపల ఫోటో సెషన్‌లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆమె బడ్జెట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందడానికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో జరిగే కేబినెట్ బేటీలో పాల్గొని బడ్జెట్ 2025 ఆమోదం పొందుతారు.
ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ 2025-26 ప్రతిపాదిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు, ఆర్థిక మంత్రి తన బడ్జెట్ బృందంతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీడీ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇస్తారు. ఇలా రేపంతా ఆర్థిక మంత్రి బిజీబిజీగా గడపనున్నారు.
