Budget 2022: ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతంగా అంచనా.. వచ్చే ఏడాది ఎంతంటే? ఎకనామిక్ సర్వే అంచనాలు ఇవే
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో వృద్ధి రేటును 9.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా, వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం (2022-23)లో వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ సర్వేను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టడం ఆనవాయితీ.
న్యూఢిల్లీ: పార్లమెంటు(Parliament)లో బడ్జెట్(Budget) సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎప్పట్లాగే బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వే(Economic Survey)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంటుల ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) వృద్ధి రేటు 9.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ సర్వే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసిన వృద్ధి రేటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను భారత దేశంలో వృద్ధి రేటు 9 శాతం ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ఎకనామిక్ సర్వే రిపోర్టు ప్రకారం, సాగు, పరిశ్రమ రంగాల్లో వృద్ధి రేటు మంచిగా ఉన్నదని, ఈ వృద్ధే భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే స్థితిలో ఉండటానికి దోహదపడిందని అన్ని స్థూల సూచికలు తెలుపుతున్నాయి. వ్యాక్సిన్ కవరేజ్, సప్లై వైపు జరిగిన సంస్కరణ ఫలాలు, సరళతరమైన రెగ్యులేషన్స్, అమాంతంగా పెరుగుతున్న ఎగుమతుల వృద్ధి, అంతేకాదు, పెట్టుబడులకు మంచి వాతావరణం ఉండటం వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి తప్పకుండా దోహదపడుతాయని ఆ నివేదిక తెలిపింది. ఈ అంచనాలు కూడా కొన్ని షరతులను పరిగణనలోకి తీసుకుని చేసినవని వివరించింది. ఇకపై మహమ్మారి కారణంగా ఎలాంటి ఆర్థిక అవరోధాలు కలుగబోవని, రుతుపవనాలు సకాలంలో సాధారణ వర్షాపాతాన్ని కురిపిస్తాయని సహా మరికొన్ని అంశాలు సానుకూల పరిమాణాలను తీసుకుని అ నివేదిక రూపొందించారు. అంతేకాదు, ఈ నివేదిక రూపొందించేటప్పుడు చమురు ధరలనూ దృష్టిలో పెట్టుకున్నారు. ఒక బ్యారెల్ ధర 70 నుంచి 75 అమెరికా డాలర్లుగా ఉంటుందని, అంతర్జాతీయ సరఫరా చైన్ కూడా సానుకూలంగా ఉంటుందని భావిస్తూ ఈ అంచనాలు కట్టారు.
ఈ ఏడాది మార్చితో ముగుస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. 11.2 శాతం పరిశ్రమల రంగం, సేవా రంగంలో 8.2 శాతం వృద్ధి, సాగు రంగంలో 3.9 శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సద్దుమణిగాక జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఆంక్షలు చాలా వరకు ఎత్తేశారు. అప్పుడు మళ్లీ ఆర్థికం పురోగమించింది. ఈ వృద్ధినీ ఎకనామిక్ సర్వే గణించింది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో జీడీపీ 8.4 శాతం పెరిగింది(గతేడాదితో పోల్చితే). ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఈ స్థాయిలో వృద్ధి సాధించడం చాలా అరుదు. గతేడాది జనవరిలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఎకనామిక్ సర్వే ఈ ఏడాది అంటే 2021-22 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును 11 శాతంగా అంచనా వేసింది. కానీ, తాజా సర్వే 9.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
ఎకనామిక్ సర్వే అంచనాలు చాలా సార్లు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ఈ సర్వేలు ప్రొజెక్ట్ చేసిన వృద్ధి వాస్తవంలో చాలా దూరంలో ఉంటున్నాయి.