న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె.. పలు ఆటో రంగ సంస్థల ఉత్పత్తిపై ప్రభావితం పడింది. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ), బజాజ్ ఆటోలతోపాటు వివిధ కంపోనెంట్ తయారీదారుల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 

హర్యానాలోని హెచ్ఎంఎస్ఐ ప్లాంట్, మహారాష్ట్రలోని బజాజ్ ఆటో చకాన్ యూనిట్, మరికొన్ని ఆటో కంపోనెంట్ తయారీదారుల కేంద్రాల్లో ఉత్పత్తికి బ్రేక్ పడింది.  సమ్మె ప్రభావంపై స్పందించేందుకు హోండా మోటారు సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ యాజమాన్యం ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.

also read మార్కెట్లోకి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్...ఫీచర్స్, ధరెంతంటే!!

మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నదంటూ 10 ప్రధాన ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ‘హర్యానాలోని మానేసర్ ప్లాంట్లోని కార్మికులు సమ్మెకు మద్దతుగా మూడు షిఫ్టుల్లో పని చేయలేదు’ అని హెచ్ఎంఎస్ఐ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సురేశ్ గౌర్ పీటీఐకి తెలిపారు. మహారాష్ట్రలోని పుణెలోగల చకాన్ బజాజ్ ఆటో ప్లాంట్లోనూ ఉత్పత్తి స్తంభించింది. ఇది పూర్తిగా మూతబడిందని ఓ యూనియన్ నాయకుడు తెలిపారు. 

మరోవైపు మారుతి సుజుకీ ఇండియా, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, హ్యుండాయ్ మోటర్స్ ఇండియా ప్లాంట్లలో ఉత్పత్తి యథాతథంగా కొనసాగింది. చకాన్లోని టాటా, మహీంద్రా ప్లాంట్ల కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని కార్మిక వర్గాలు వెల్లడించాయి. గుర్గావ్, మానేసర్లలోని మారుతి సుజుకీ ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి.

గుజరాత్ ప్లాంట్ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. కాగా, తమిళనాడులోని శ్రీపెరంబుదూర్-అర్గదం పారిశ్రామిక వాడలో మిశ్రమ స్పందన కనిపించింది. దాదాపు 3000 కార్మికులు సమ్మెకు మద్దతు పలికారు. ఇక్కడి హ్యుండాయ్ మోటర్స్ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగులు, మరికొన్ని బహుళజాతి సంస్థల కార్మికులు వేతనం నష్టపోతామని తెలిసి కూడా సమ్మెలో పాల్గొనేందుకు సెలవు తీసుకున్నారని ట్రేడ్ యూనియన్ వర్గాలు చెప్పాయి. సుమారు 1,600 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రకటించారు. వీరిని స్థానికంగా ఉన్న ఓ మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో నిర్బంధించి, ఆ తర్వాత కాసేపటికి విడుదల చేశారని పేర్కొన్నారు. 

also read హ్యుందాయ్ నుండి కొత్త అప్ డేట్ లేటెస్ట్ మోడల్ కార్....

ఇక ఐటీ రంగ సంస్థ హెచ్సీఎల్.. తమ ఉద్యోగుల భద్రత కోసం పలు చర్యలు తీసుకున్నది. ఇంటి దగ్గర్నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొన్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వివిధ కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాలు, ప్రైవేటీకరణ అంశాలను నిరసిస్తూ ఈ సమ్మె నిర్వహించారు.

కనీస వేతనాలు, ప్రతి ఒక్కరికీ రూ.6000 పెన్షన్, సామాజిక భద్రత, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ప్రజలకు కావాల్సినంత స్థాయిలో రేషన్ సరకుల సరఫరా తదితర 12 డిమాండ్లతో ఈ ఆందోళన సాగిందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. కార్మిక శ్రేయస్సు కంటే ప్రజా శ్రేయస్సు కోసమే ఈ సమ్మెకు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు.