హైదరాబాద్ మార్కెట్లోకి కొత్త బైక్...గంటకు 85 కిలోమీటర్ల వేగంతో...
హైదరాబాద్ మార్కెట్లోకి మరో బైక్ వచ్చి చేరింది. ఒకసారి చార్జి చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వీటి ధరలను రూ.1.03 లక్షలుగా, రూ.84,999గా నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణ మార్కెట్లోకి రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. రెండు రకాల్లో విడుదల చేసిన ఈ బైక్‌ల్లో ఆర్‌వీ400 ధర రూ.1,03,999గా, మరో మోడల్ ఆర్వీ 300 బైక్ రూ.84,999గా నిర్ణయించింది. ఆర్వీ 400 బైక్ వాయిదాలపై నెలకు రూ.3,999 చొప్పున 38 నెలలు, ఆర్‌వీ 300 నెలకు రూ.2,999 చొప్పున 36 నెలలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. అయితే మొత్తం నగదు చెల్లించినా ఆర్వీ 400 బైక్ బుకింగ్ కోసం రూ.3,999 చెల్లించాలి. ఆర్వీ 300 బైక్ బుకింగ్ కోసం రూ.2,999 చెల్లించాల్సి ఉంటుంది.
also read చౌక ధరకే కొత్త వెహికల్స్.. సంస్థలు.. డీలర్ల ఆఫర్ల వర్షం.. బట్?
ఇదివరకే ఢిల్లీ, పుణెల్లో విడుదల చేసిన ఈరెండు రకాల బైకులకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందని, హైదరాబాద్‌లో ఉన్న కస్టమర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించినట్లు రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ బైకును కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్/ఆర్‌టీవో, బీమా, స్మార్ట్‌కార్డ్‌కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఫేమ్-2 కింద ఇచ్చే సబ్సిడీ తగ్గించిన తర్వాతే సంస్థ ఈ ధరను నిర్ణయించింది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ బైక్ బ్యాటరీ ఒక్కసారి రీచార్జి చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది. ఈ బైక్స్‌లో 3.24 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. త్వరలోనే ముంబై, చెన్నై నగరాల్లో కూడా ఈ బైక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది.
also read కార్మికుడికి కరోనా పాజిటివ్: హ్యుండాయ్ ఫ్యాక్టరీ క్లోజ్
4.5 గంటల్లో ఈ బైక్ బ్యాటరీ పూర్తిగా చార్జి కానున్నది. నోయిడాలో ఉన్న ప్లాంట్లో ఈ బైకులను తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతానికి ఈ బైకులకు అత్యధికంగా డిమాండ్ ఉండటంతో వెయింటింగ్ పీరియడ్ ఐదు నెలలు ఉండగా, దీనిని త్వరలో మూడు నెలలకు తగ్గించనున్నట్లు రాహుల్ శర్మ ప్రకటించారు.