కార్మికుడికి కరోనా పాజిటివ్: హ్యుండాయ్ ఫ్యాక్టరీ క్లోజ్
దక్షిణ కొరియాలోని తన ఫ్యాక్టరీలోని కార్మికుడికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలడంతో ఆటో మేజర్ హ్యుండాయ్ అప్రమత్తమైంది. ఉల్ఫాన్ లోని ఉత్పాదక యూనిట్ మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
హ్యుండాయ్ మోటార్స్‌పై కరోనా వైరస్ ప్రభావం బాగానే పడింది. ఆ సంస్థకార్మికుడికి కరోనా వ్యాపించడంతో ఒక ఫ్యాక్టరీని మూసివేసింది. ఈ ఫ్యాక్టరీ ఉల్సాన్‌లో ఉన్న ఈ కంపెనీని మూసివేసిన విషయాన్ని హ్యుండాయ్ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు దాదాపు ఐదుశాతం వరకు కుంగిపోయాయి.
మరోపక్క చైనాలో కొత్త కేసుల నమోదు తగ్గి విడిభాగాల తయారీ సంస్థలు కోలుకొంటుండగా హ్యుండాయ్ కీలక ప్లాంట్ మూసివేయడం గమనార్హం. దక్షిణ కొరియాలో కరోనా ఉద్ధృతంగా ద్యెగుకు ఉల్సాన్ కేవలం గంట ప్రయాణ దూరంలో ఉంది.
చైనా తర్వాత అత్యధిక మంది కరోనా వైరస్‌కు గురైన రెండో దేశం దక్షిణ కొరియా కావడం గమనార్హం.. దీంతో రెండు అతిపెద్ద కంపెనీలైన ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్, ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం మరో 256 కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో వైరస్ బాధితుల సంఖ్య 2,022కు చేరింది. తాజాగా కరోన బాధితుడుని గుర్తించి ప్లాంట్‌ను మూసేసిన హ్యూండాయ్.. అతడితోపాటు పనిచేసే సహచరులను పర్యవేక్షణలో ఉంచింది. ఈ విషయాన్ని హ్యూండాయ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
హ్యుండాయ్ ఉల్సాన్‌లో ఐదు కారు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. వీటిలో మొత్తం ఏటా 14 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. హ్యుండాయ్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేసే వాహనాల్లో 30శాతం ఇక్కడే తయారవుతాయి. ఇక్కడ మొత్తం 34వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద కార్ల తయారీ కాంప్లెక్స్ ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం మూసివేసిన కర్మాగారంలో టక్సన్, పల్సెడ్, శాంటాఫే, జెన్సిస్ జీవీ80 వంటి వాహనాలను తయారు చేశారు. మరోపక్క హ్యుండాయ్‌కు విడి భాగాలను సప్లై చేసే సైయోజిన్ ఇండస్ట్రీలో ఒక కార్మికుడు కరోనా కారణంగా మృతి చెందాడు. దీంతో కొన్నాళ్లపాటు ఈ ఫ్యాక్టరీని మూసివేసి బుధవారమే తెరిచారు.. అదే సమయంలో హ్యుండాయ్ ఫ్యాక్టరీ మూసివేశారు.