కొత్త వాహనదారులకు గుడ్ న్యూస్: ఆగస్ట్ 1 నుంచి న్యూ పాలసీ...
కొత్త వాహనాల కొనుగోలుదారులకు భారత బీమా నియంత్రణ అభివ్రుద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) శుభవార్తనందించింది. మూడేళ్ల, ఐదేళ్ల దీర్ఘకాలిక బీమా పాలసీలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది.
టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ కొనాలనుకునేవారికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) శుభవార్త అందించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ తాజా నిర్ణయంతో కార్లు, మోటారు సైకిళ్ల ధరలు తగ్గనున్నాయి.
లాంగ్ టర్మ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలనుఉపసంహరిస్తున్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ‘ఐఆర్‌డీఏఐ’ ప్రకటించింది. దీంతో వాహన ధరలు తగ్గిపోనున్నాయి. ఐఆర్‌డీఏఐ తాజాగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిబంధనల ప్రకారం కొత్త టూవీలర్లు, ఫోర్ వీలర్లకు ఇక మూడేళ్లు, ఐదేళ్ల కాల పరిమితిలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజ్ లాంగ్ టర్మ్ పాలసీలను నిలిపివేయనున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనున్నది.
వాహన తయారీదారులు, కార్ల కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని కలిగించే విషయాలలో, దీర్ఘకాలిక మోటారు భీమా పాలసీ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నదని ఐఆర్‌డిఎఐ ఓ సర్క్యులర్‌లో పేర్కొన్నది.
also read హోండా కార్స్ లో లోపాలు.. 65,651 కార్లను వెనక్కి...
అయితే, వాహనాల బీమాకు సంబంధించి ఇతర నిబంధనలు కొనసాగుతాయని ఐఆర్డీఏఐ తెలిపింది. దీర్ఘకాలిక ప్యాకేజీ కవర్ల పనితీరును విశ్లేషించిన తర్వాత దానిపై వినియోగదారుల్లో నెలకొని ఉన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది.
టూ వీలర్స్ , కార్ల ఆన్-రోడ్ ధర తగ్గుతున్నందున ఈ చర్య వాహనాల డిమాండ్ పెంచడానికి సహాయపడుతుందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం విషయానికి వస్తే.. టూవీలర్లకు రూ.8,000 దాకా, కార్లకు రూ.40,000 దాకా భారం భరించాల్సి వస్తున్నది.
ఆగస్టు ఒకటో తేదీ తర్వాత ఆ భారం తగ్గిపోనుంది. దీంతో వాహనాల కొనుగోళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా అనంతర కాలంలో ప్రజా రవాణాకు స్వస్తి పలికి సొంత వాహనాలపై ఆఫీసులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి ఐఆర్డీఏఐ నిర్ణయం ఆశాకిరణమే.