న్యూఢిల్లీ: హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నుంచి సరికొత్త స్పోర్ట్స్‌ బైక్‌ హోండా సీబీఆర్‌-650ఆర్‌ భారత మార్కెట్‌లోకి విడుదలైంది. దీని ధర రూ. 7.70 లక్షలుగా నిర్ణయించారు. ఈ మోడల్‌ గ్రాండ్‌ ప్రీ రెడ్‌, మ్యాటీ గన్‌పౌడర్‌ బ్లాక్‌ వెర్షన్లలో లభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది కవాసాకీ నింజా 650 మోడల్ బైక్‪కు గట్టి పోటీనిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసిన ఈ స్పోర్ట్స్‌ బైక్‌ 649 సీసీ, లిక్విడ్‌ కూల్డ్‌, ఇన్‌లైన్‌ ఫోర్ సిలిండర్‌ సామర్థ్యం గల ఇంజిన్ సాయంతో 1200 ఆర్‌పీఎం వద్ద 94 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 8500 ఆర్‌పీఎం వద్ద 64 న్యూటన్‌ మీటర్‌ (ఎన్‌ఎం) టార్క్‌ శక్తిని అందిస్తుంది. 
భారత్‌లో విడుదల చేసిన ఈ మోడల్స్‌లో సంస్థ కొన్ని మార్పులు చేసింది. 11,500 ఆర్‌పీఎం వద్ద 87 బీహెచ్‌పీ శక్తితో 60.1 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేసే విధంగా ఈ మోడల్స్‌ను డిజైన్‌ చేసి భారత మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది.

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్విందర్‌ సింగ్‌ గులేరియా స్పందిస్తూ‘భారత మార్కెట్‌లో హోండా సంస్థకు చెందిన ప్రీమియం స్పోర్ట్స్‌ బైక్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు మొదలు పెడతామని గత వారమే మేం ప్రకటించాం‘ అని చెప్పారు.

భవిష్యత్‌లో భారత మార్కెట్‌లో హోండా ప్రీమియం స్పోర్ట్స్‌ బైక్‌ల వాణిజ్యం మరింత పుంజుకునేందుకు ఈ మోడల్‌ దోహద పడుతుందని ఆశిస్తున్నామని హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్విందర్‌ సింగ్‌ గులేరియా చెప్పారు.  

శక్తివంతమైన ప్రదర్శన, రేసింగ్‌ మోడ్‌తో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన హోండా సీబీఆర్‌-650ఆర్‌ మోడల్‌ మిడిల్వెయిట్‌ స్పోర్ట్స్‌ బైక్‌ ఔత్సాహికులను ఎంతగానో ఆకర్షిస్తుందని  హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్విందర్‌ సింగ్‌ గులేరియాపేర్కొన్నారు. 

గతంలో మార్కెట్‌లో విడుదల చేసిన ప్రీమియం స్పోర్ట్స్‌ బైక్‌‌ హోండా సీబీఆర్‌-650ఎఫ్‌తో పోలిస్తే ఫుల్‌ హెచ్‌డీ లైటింగ్‌, డిజిటల్‌ ఎల్‌సీడీ డిస్ప్లే, క్లిప్‌‌ ఆన్‌ హ్యాండిల్‌ బార్స్‌, అత్యాధునిక హోండా సెలెక్టబుల్‌ టార్క్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, అత్యుత్తమ స్టీరింగ్‌ క్వాలిటీతో ఈ మోడల్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. 

దేశవ్యాప్తంగా ఉన్న 22 హోండా వింగ్‌వరల్డ్‌ డీలర్ల వద్ద ఈ మోడల్‌ అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది ప్రత్యర్థి బైక్ సంస్థ ‘కవాసాకీ నింజా’ మోడల్ బైక్ 650తో తలపడనున్నదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.