ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ ఎస్కార్ట్స్‌ శుక్రవారం కాన్సెప్ట్‌ హైబ్రిడ్‌ ట్రాక్టర్‌, బ్యాక్‌హో లోడర్‌ను ఆవిష్కరించింది. కంపెనీ వార్షిక ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ 2019 సందర్భంగా ఈ హైబ్రిడ్‌ ట్రాక్టర్‌ను ప్రదర్శించింది. ఈ ట్రాక్టర్ ఇంధనంతోపాటు బ్యాటరీతో నడుస్తుందని ఎస్కార్ట్స్‌ తెలిపింది. 

హైబ్రిడ్‌ మోడ్‌లో రూపొందించిన ఈ ట్రాక్టర్‌.. డీజిల్‌, ఎలక్ట్రిక్‌ ఎనర్జీని ఉపయోగించుకుంటుందని పేర్కొంది. ఇక ఎలక్ట్రిక్‌ మోడ్‌లో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల చేయకుండా కేవలం బ్యాటరీతో మాత్రమే నడుస్తుందని ఎస్కార్ట్ ట్రాక్టర్స్ తెలిపింది.

గ్రామీణ రవాణా అవసరాల కోసం రూపొందించిన బహుళ ప్రయోజనకారి వాహనం ‘రైడర్‌’ను ఎస్కార్ట్స్‌ ఈ ప్రదర్శనలో ఆవిష్కరించింది. కంపెనీ ఇన్నోవేషన్‌, ఆర్‌ అండ్‌ డీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయటంపై ప్రధానంగా దృష్టి పెడుతుందని ఎస్కార్ట్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ నందా తెలిపారు.

స్మార్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌తో రూపొందించిన ఈ ట్రాక్టర్‌ కర్బన ఉద్గారాలను తగ్గించటమే కాకుండా ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. 750 గ్రాముల పేలోడ్‌తో రూపుదిద్దుకున్న ఫోర్ వీలర్స్ మల్టీ యుటిలిటీ రూరల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ (ఆర్టీవీ)గా పేరొందిన రైడర్ ట్రాక్టర్ రోజువారీగా రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ అవసరాల ఉపకరిస్తుంది. 

ఎస్కార్ట్ ట్రాక్టర్స్ చైర్మన్ నిఖిల్ నందా స్పందిస్తూ ఆర్టీవీ  గ్రామీణ, నిర్మాణ రంగాలకు పలు అప్లికేషన్స్‌ను ఆఫర్ చేస్తోందన్నారు. వచ్చే 12 నెలల్లో టూ వీల్ డ్రైవ్ వేరియంట్‌ను విపణిలోకి ప్రవేశపెడతామని తెలిపారు. భవిష్యత్‌లో ఫోర్ వీల్ డ్రైవ్, విద్యుత్ వేరియంట్ ట్రాక్టర్ విపణిలోకి విడుదల చేస్తామన్నారు. 

హైబ్రీడ్ ట్రాక్టర్ 75-90 హెచ్పీ సెగ్మెంట్‌లో లభిస్తుంది. గంట సేపట్లో చార్జింగ్ అవుతుంది. డీజిల్ ఇంజిన్‌తో నడుస్తున్న బ్యాటరీలను కూడా చార్జి చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ 1.5 గంటల్లో చార్జి అవుతుందని నిఖిల్ నందా పేర్కొన్నారు.