Asianet News TeluguAsianet News Telugu

బీఎస్-6 అమల్లోకి వచ్చినా డీజిల్‌ కార్ల సేల్స్ యధాతథం: టయోటా

బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి వచ్చినా డీజిల్ కార్ల విక్రయాన్ని కొనసాగిస్తామని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తెలిపింది. మారుతి సుజుకి డీజిల్ కార్లను, టాటా మోటార్స్ బుల్లి కార్ల విక్రయాలను వచ్చే ఏప్రిల్ నుంచి నిలిపేయనున్నట్లు ప్రకటించింది.

Toyota to keep selling diesel models in India as it expects demand to continue
Author
Mumbai, First Published Aug 26, 2019, 11:55 AM IST

ముంబై: భారత్‌లో డీజిల్‌  కార్ల విక్రయాలను కొనసాగించాలని టయోటా నిర్ణయించింది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం బీఎస్- 6 కొత్త నిబంధనలు వస్తున్న నేపథ్యంలో ఈ కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో టయోటా మోటార్స్ డీజిల్ కార్ల ఉత్పత్తులను కొనసాగిస్తామని తెలిపింది. ఇప్పటికే టయోటా భారత్‌లో బీఎస్‌-6 డీజిల్‌ ఇంజిన్లను తయారు చేసే ప్లాంటులో పెట్టుబడులను కూడా పెట్టింది. 

‘డీజిల్‌ వేరియంట్లలో ఇంకా డిమాండ్‌ ఉన్న విషయాన్ని మేం గమనిస్తున్నాం. మేం వాటి తయారీని కొనసాగిస్తాం. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే వరకు ఇది కొనసాగుతుంది. మేకిన్‌ ఇండియాను దృష్టిలో పెట్టుకొని దీనిని కొనసాగిస్తాం’ అని టయోట కిర్లోస్కర్‌ మోటార్స్‌ వైస్‌ ఛైర్మన్‌ శేఖర్‌ విశ్వనాధన్‌ పీటీఐకి తెలిపారు. 

భారత్‌లో టయోటా ఇన్నోవా, ఫార్చ్యూనర్‌ వంటి పాపులర్‌ మోడళ్లను విక్రయిస్తోంది. టయోటా మోటార్స్‌ భారత్‌లో విక్రయించే కార్లలో డీజిల్‌, పెట్రోల్‌ వేరియంట్ల నిష్పత్తి 82:18గా ఉంది. దీంతో టయోటా డీజిల్‌ వేరియంట్లను కొనసాగించనుంది. 

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రజాదరణ పొందిన మోడల్ కార్లు ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ కార్ల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విక్రయాల్లో డీజిల్ -పెట్రోల్ 82:18 శాతంగా ఉన్నాయి. ప్రయాణ కార్లు 50:50 నిష్పత్తికి చేరుకున్నాయి. మార్కెట్ లీడర్ మారుతి సుజుకి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి డీజిల్ కార్ల విక్రయాలే కాదు ఉత్పత్తి కూడా నిలిపేయనున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ బుల్లికార్లను ఉపసంహరించనున్నట్లు పేర్కొంది. మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా జాయింట్ వెంచర్ కింద టయోటా, కిర్లోస్కర్ గ్రూప్ విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios