హైదరాబాద్: భాగ్య నగరానికి చెందిన వీజీ ఆర్సిడో ఎనర్జీ స్టార్టప్ కంపెనీ ఎలక్ర్టిక్‌ ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలతో మొబిలిటీ సేవలను ప్రారంభిస్తోంది. ‘ఈ-యానా’ బ్రాండ్‌తో పూర్తిగా విద్యుత్ వాహనాలతో టాక్సీ సేవల రంగంలోకి అడుగుపెడుతోంది.

ముందుగా వరంగల్‌, కరీంనగర్‌లో ఈ-ఆటోలు, ద్విచక్ర వాహనాలతో సేవలు ప్రారంభిస్తున్నామని వీజీ ఆర్సిడో ఎనర్జీ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ గంగరాజు చెప్పారు. 2020 జూన్‌ నాటికి హైదరాబాద్‌లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

also read కొత్త సంవత్సరంలో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న హ్యుందాయ్

తెలంగాణాలో 10 పట్టణాలతో పాటు దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వీజీ ఆర్సిడో ఎనర్జీ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ గంగరాజు చెప్పారు. సొంత రిక్షాలు, ద్విచక్ర వాహనాల ద్వారా సేవలను అందించనున్నది. దీనివల్ల పట్టణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో యువతకు ఉపాధి లభిస్తుంది.
 
ఈ-ఆటో రిక్షాలను కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ, పవర్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. ఆయా పట్టణాల్లో సోలార్‌ విద్యుదుత్పత్తి వసతుల ద్వారా బ్యాటరీలను రీచార్జ్‌ చేస్తారు. స్వాప్‌ పద్ధతిలో వెంటనే బ్యాటరీలను మార్చుకునే వసతి కూడా ఉంటుంది. 2020 మార్చి నాటికి 1,000 వాహనాలను ప్రవేశపెట్టనున్నామని.. విస్తరణకు రూ.50-60 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని విజయ్‌ కుమార్‌ చెప్పారు. 

ఆర్కెడో సిస్టమ్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ రిక్షా, బైక్ సేవలందించేందుకు ఉద్దేశించిన ఉమ్మడి వెంచర్రైన ఈ-యానా సంస్థ యాప్​ను, వాహనాలను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. చిన్న పట్టణాల్లో పూర్తిగా ఈ-వాహన ట్యాక్సీ సేవలను ప్రారంభించడం అభినందనీయమని, కరీంనగర్‌, వరంగల్‌లో ఈ-యానా అనుభవాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. 

తెలంగాణలో పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, ఇక్కడ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కెనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్​ సంస్థను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కోరారు. 

బ్యాటరీల రీచార్జింగ్‌కు సోలార్‌ విద్యుత్‌పై ఆధారపడడాన్ని కూడా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కొనియాడారు. దేశంలోనే ఎలక్ర్టిక్‌ వాహనాల కోసం అత్యధిక చార్జింగ్‌ స్టేషన్లు ఉన్న నగరం హైదరాబాదేనని, ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణానేనని చెప్పారు. హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉండటం వల్ల.. లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుందని జయేష్ రంజన్ తెలిపారు.

also read జనవరి నుండి ఆ బైక్ ధరలు పెంపు... అసలు కారణం ఏంటి ?

భారీగా విద్యుత్ వాహనాల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత వాటి ధరలు తగ్గే అవకాశం ఉన్నదని కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, సీఈఓ సులజ్జా ఫిరోదియా మోత్వాని అన్నారు. పెట్రోల్, డీజిల్ ఇంధన వాహనాలు కొత్త పర్యావరణ నిబంధనలతో రావాల్సి ఉండటంతో వాటి తయారీ ఖర్చు పెరుగుతున్నదని చెప్పారు. 

అభివ్రుద్ది చెందిన దేశాలతోపాటు భారత్ వంటి దేశాల్లో ఇప్పుడు అంతా విద్యుత్ వాహనాల గురించే మాట్లాడుతున్నారని కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, సీఈఓ సులజ్జా ఫిరోదియా మోత్వాని పేర్కొన్నారు. వచ్చే 10-20 ఏళ్లలో దేశంలో అధిక భాగం విద్యుత్‌వే అవుతాయన్నారు. గత మూడేళ్లలో కైనెటిక్ గ్రీన్ 25 వేల వాహనాలను విక్రయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 150 మంది డీలర్లు ఉన్నారని చెప్పారు. కొత్తగా విద్యుత్ సైకిళ్లను విపణిలోకి విడుదల చేశామని, దీని ధర రూ.24 వేలని పేర్కొన్నారు.