Asianet News TeluguAsianet News Telugu

2020కల్లా దేశవ్యాప్తంగా 500 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు: టాటా పవర్

భారతదేశ వ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, విజయవాడ, హౌసూర్ నగరాలు సహా తొమ్మిది రాష్ట్రాల పరిధిలోని 15 నగరాల్లో టాటా పవర్ 85 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాదిలోపు 500 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. చమురు సంస్థలతో ఇందుకు భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.

Tata Power to Set Up 500 EV Charging Stations in India by 2020, Says Ramesh Subramanyam
Author
New Delhi, First Published Sep 3, 2019, 10:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా వరుస చర్యలు చేపడుతోంది. విద్యుత్ వాహనాల వాడకం పెంపుదలకు పన్ను రాయితీలు, బెనిఫిట్లు తదితర ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించడంతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపులను అందిస్తోంది. 

విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతున్నా కొద్దీ చార్జింగ్ మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం చార్జింగ్ స్టేషన్ల కల్పన ప్రాథమిక దశలోనే ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిధిలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు దిశగా అడుగులేసింది. ఈ విషయమై టాటా పవర్ న్యూ బిజినెసెస్ సీఎఫ్ఓ అండ్ ప్రెసిడెంట్ రమేశ్ సుబ్రమణ్యం ప్రత్యేకంగా ద్రుష్టిని కేంద్రీకరించారు. 

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు క్లీనర్ ఆల్టర్నేటివ్స్ దిశగా అడుగులు వేస్తున్నాయి. 2025 నాటికి విద్యుత్ వాహనాల విక్రయాలు 1.1 కోట్లకు, 2030 నాటికి మూడు కోట్లకు చేరుతాయని బ్లూమ్ బర్గ్ న్యూ ఎనర్జీ ఫైనాన్స్ (ఎన్ఈఎఫ్) వార్షిక నివేదిక తెలిపింది. 2017లో అంతర్జాతీయంగా విద్యుత్ వాహనాల విక్రయాలు 11 లక్షలుగా నమోదయ్యాయి.  

వివిధ కారణాల రీత్యా భారతదేశంలో విద్యుత్ వాహనాల విక్రయం గానీ, వాడకం గానీ ఊపందుకోలేదు. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం భారతదేశ రోడ్లపైకి నూతనంగా 2.5 కోట్ల వెహికల్స్ వస్తే, వాటిలో విద్యుత్ వాహనాల వాటా 0.3 శాతం లోపే. అంటే సుమారు 56 వేల వాహనాలు మాత్రమే విద్యుత్ వినియోగ వాహనాలు. 

2013లో ప్రకటించిన నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్ఈఎంఎంపీ)-2020 ప్రకారం 2020 నుంచి ప్రతియేటా 60 నుంచి 70 లక్షల విద్యుత్ వాహనాల విక్రయాలు సాగుతాయని అంచనా. 2030 నాటికి రోడ్లపై పూర్తిగా గ్రీన్ వెహికల్స్ అందుబాుటలోకి తేవాలన్నది ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రణాళికగా ఉంది. కానీ వాస్తవ పరిస్థితులేమిటంటే వచ్చే ఐదేళ్లలో పూర్తిగా విద్యుత్ వాహనాల విక్రయాలు 15 శాతానికి మాత్రమే పరిమితం అవుతాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ముడి చమురు సంస్థలు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్ పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సంస్థలతో టాటా పవర్ తొలుత భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. వారితో కలిసి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల విస్తరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని టాటా పవర్ సీఎఫ్ఓ రమేశ్ సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 61 వేలకు పైగా పెట్రోల్ కం డీజిల్ రిటైల్ ఔట్ లెట్లు ఉన్నాయి. కానీ విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు 500 మాత్రమే. 

హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీలతో పరస్పర సహకారంతో దేశవ్యాప్తంగా అవసరమైన చోట విద్యుత్ వాహనాలకు అవసరమైన చార్జింగ్ మౌలిక వసతులు కల్పించడం టాటా పవర్ లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం టాటా పవర్ దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, విజయవాడ, హోసుర్ నగరాలు సహా తొమ్మిది రాష్ట్రాల పరిధిలో పబ్లిక్, సెమీ పబ్లిక్ 85 చార్జింగ్ స్టేషన్లు కలిగి ఉంది. 

2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా 500 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు మహారాష్ట్రలో అదనంగా 100 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నది. చమురు సంస్థలతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ నెట్ వర్క్ కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నది టాటా పవర్. 

2030 నాటికి ఢిల్లీలోనే మూడు లక్షల ఫాస్ట్ చార్జర్లు, కోటి కార్ల పార్కింగ్ వసతులు కల్పించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 1-1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం. మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఎంఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం వచ్చే రెండేళ్లు విద్యుత్ చార్జింగ్ స్టేషన్లలో యూనిట్ విద్యుత్ ధర రూ.6గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాత్రి వేళ్లలో యూనిట్ విద్యుత్ చార్జింగ్ కోసం రూ.0.75 తగ్గిస్తే, ఉదయం, సాయంత్రం రద్దీ వేళ్లలో అదనంగా రూ.0.50 నుంచి రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. 

విద్యుత్ వాహనాల వాడకం దారుల కోసం టాటా పవర్ మొబైల్ యాప్ ప్రవేశపెట్టనున్నది. చార్జింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొబైల్ యాప్ ద్వారా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ల నుంచి గానీ నగదు రూపంలో గానీ చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios