ధనికులకు, ఎగువ మధ్యతరగతి ప్రజలకు మాత్రమే సొంతమనుకున్న కారును దిగువ మధ్యతరగతి ప్రజలకు చేరువ చేసేందుకు వచ్చిన ‘నానో’ఇక కాలగర్భంలోకి వెళ్లిపోనుందా..? అంటే అవుననే వినిపిస్తోంది. కొనేవారే కరువవ్వడంతో నానో తయారీని నిలిపివేయాలని టాటా మోటార్స్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే కారును ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో 2008లో పీపుల్స్ కారు పేరుతో టాటా ‘నానో’ని మార్కెట్లో ప్రవేశపెట్టింది.

కొద్దిరోజులు దీనిపై క్రేజ్ ఉన్నప్పటికీ.. మిగిలిన కంపెనీలు కూడా తక్కువ ధరకే కార్లు అందించేందుకు ముందుకు రావడం.. ప్రజల ఆదాయాలు పెరగడంతో.. నానోని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతేడాది జూన్‌లో 275 కార్లను తయారు చేసి.. 25 కార్లను మాత్రమే ఎగుమతి చేసింది.. ఈ ఏడాది కేవలం ఒక్కటంటే ఒక్కటే కారును తయారు చేసిందంటే నానో పట్ల డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నానో వృద్ధిశాతం పడిపోతుండటంతో ఎలక్ట్రిక్ కారుగా మార్చేందుకు సైతం టాటాలు ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది.. కానీ యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నానో ఉత్పత్తిని నిలిపివేయబోతున్నారని ప్రచారం జరిగింది. దీనికి తోడు నానోని చౌక కారుగా ప్రకటించడం తాము చేసిన తప్పని టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సైతం వ్యాఖ్యానించడంతో ఇక నానోకి కాలం చెల్లినట్లేనని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పేద ప్రజలకు తక్కువ ధరకే కారు అందించాలన్న రతన్ టాటా కల పదేళ్లలోనే నీరుగారిపోవడంత దురదృష్టకరం.