న్యూఢిల్లీ‌: టాటా మోటార్స్‌ తన అనుబంధ సరికొత్త ఎస్‌యూవీ హారియర్‌కు ఎలక్ట్రానిక్‌ సన్‌రూఫ్‌ అమర్చుకొనే ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇది టాటా మోటార్స్‌ జన్యూన్‌  యాక్సెసిరీస్‌ ద్వారా ఇవి లభించనున్నది. ఇప్పటికే మార్కెట్లో ఉన్నవి, సరికొత్త వాహనాలు రెండింట్లో దీనిని అమర్చుకొనే అవకాశం కల్పించారు. 

కస్టమర్లు టాటా మోటార్స్‌ డీలర్ల వద్ద రూ.95,100, ఇన్‌స్టలేషన్స్‌ ఛార్జీలు చెల్లిస్తే సన్ రూఫ్ చెల్లించాల్సి ఉంటుంది. డీలర్‌షిప్‌ను బట్టి ఈ ఖర్చు రూ. లక్ష వరకు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టాటా మోటార్స్‌ అధికారికంగా ప్రకటించింది. 

‘జనవరిలో టాటా మోటార్స్‌ హారియర్‌ను మార్కెట్లోకి తెచ్చినప్పటి నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు 10వేల హారియర్ కార్లు భారత రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. మా కస్టమర్లకు అందించే ఆఫర్లను మరింత బలపర్చేందుకు ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌ను తీసుకొచ్చాం’ అని టాటా మోటార్స్ పేర్కొంది. 


ప్రస్తుతం హారియర్‌ వాడుతున్న వినియోగదారులు రూ.95,100, ఇన్‌స్టలేషన్‌ ఛార్జిలను చెల్లించి ఈ ఆఫర్‌ వాడుకోవచ్చునని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. టాటా హారియర్‌లో అమర్చనున్న కొత్త ఎలక్ట్రానిక్‌ సన్‌‌రూఫ్‌ హెచ్‌- 300ను వెబాస్టో తయారు చేస్తోంది. 

ఈ సన్‌రూఫ్‌ను పూర్తిగా శిక్షణ పొందిన నిపుణులతోనే అమరస్తామని టాటా మోటార్స్ పేర్కొంది. దీనికి రెండేళ్ల వారంటీని ఇస్తోంది. ఈ సన్‌ రూఫ్‌ ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి రక్షణ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 

మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రమైన నేపథ్యంలో టాటా మోటార్స్ హారియర్ మోడల్ కారును ‘డార్క్ ఎడిషన్’ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బీఎస్ -6 ప్రమాణాలతో త్వరలో సెవెన్ సీటర్ హారియర్ కారును త్వరలో ఆవిష్కరించనున్నది.