వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే సెవెన్ సీటర్ కారు మోడల్ ట్రైబర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది రెనాల్ట్. మూడేళ్లలో రెండు లక్షల యూనిట్ల విక్రయం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో అమ్మకాలను రెట్టింపు చేసుకునే దిశగా ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో సేల్స్ పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం భారత్‌లో ఏటా దాదాపు 80వేల వాహనాలను రెనాల్ట్ విక్రయిస్తోంది. వచ్చే మూడేళ్లలో కార్ల విక్రయాలను రెండు లక్షలకు పెంచుకోవాలని యోచిస్తోంది.
కొత్త మోడళ్లు విడుదల, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలను పెంచుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది రెనాల్ట్. ఈ ప్రణాళికలో భాగంగానే బహుళ ప్రయోజిత వాహనం ట్రైబర్‌ను బుధవారం విడుదల చేసింది. ధర విషయానికి వస్తే బేసిక్ మోడల్ ఆర్‌ఎక్స్‌ఈ రూ.4.95లక్షలుగా, ఆర్‌ఎక్స్‌ఎల్ రూ.5.49లక్షలుగా, ఆర్‌ఎక్స్‌టీ రూ.5.99లక్షలుగా, ఆర్‌ఎక్స్‌జెడ్ రూ.6.49లక్షలుగా నిర్ణయించారు.
ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన రెనాల్ట్ ట్రైబర్ కారులో ఏడు సీట్లు, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ‘2022 వరకు ఏటా ఒక కొత్త మోడల్‌ను భారత్ విపణిలోకి విడుదల చేయనున్నామ’ని రెనో ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు.
నాలుగు మీటర్లు పొడవు గల ఈ కారు సెవెన్ సీటర్ మోడల్‌గా వినియోగదారుల్ని ఆకట్టుకోనున్నది. అయితే అవసరాలను బట్టి చివరి వరుసలోని సీట్లని తొలగించి ఎక్కువ లగేజీ పెట్టుకునే వసతి కూడా కల్పించారు. అవసరాన్ని బట్టి కారు క్యాబిన్‌ను 100 రకాలుగా మార్చుకొనే ఈజీఫిక్స్ అనే సరికొత్త విధానం ఈ కారులో ప్రత్యేకత.
బూట్ స్పేస్ 84 లీటర్లకు పరిమితం చేశారు. అయితే సీట్లు తొలగించే కొద్దీ 625 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. చెన్నై తయారీ కేంద్రం నుంచి ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీ నేటి నుంచి దీని విక్రయాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ మోడళ్ల స్పూర్తితో ఈ కారును రూపొందించారు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారులో 16 అంగుళాల అలాయ్ వీల్స్, 8అంగుళాల టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, రేర్ పార్కింగ్ సెన్సర్లు, సీట్‌బెల్ట్ రిమెంబర్ వ్యవస్థ, రెండు, మూడు వరుసల్లో 12వీ ఛార్జింగ్ పాయింట్లు, క్లైమేట్ కంట్రోల్, వెనక కూర్చునే వారికి ప్రత్యేక ఎయిర్ కంట్రోల్ వ్యవస్థ లాంటి అనేక హంగులు దీని సొంతం.
రెనాల్ట్ ట్రైబర్ మోడల్ కారు 6250 ఆర్‌పీఎంతో 71బీహెచ్‌పీ శక్తి, 3500 ఆర్‌పీఎంతో 96 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు 5- స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లను అమర్చారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 29, 2019, 12:29 PM IST