దసరా, దీపావళి పండగల వేళ  ఏ ఇంట్లో చూసినా నూతనత్వం కనిపిస్తుంది. చాలామంది పండగల సందర్భంగా ఏదో ఒక వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తారు. నచ్చిన బైక్‌ కొనుక్కొని రయ్‌మంటూ దూసుకెళ్లాలని కుర్రకారు.. బడ్జెట్‌కు అనుగుణంగా పాత వాహనాల స్థానే కొత్తవాటిని కొనుగోలు చేయాలని మధ్యతరగతి ప్రజలు... సొంత కారు కొనుక్కోవాలని ఉద్యోగులు ఆలోచిస్తుంటారు. 

వీరంతా పండగ రోజుల్లోనే తమ కలలను సాకారం చేసుకుంటున్నా కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భాగ్య నగరంలో వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దసరా వెళ్లిపోయింది.. దీపావళి వస్తోంది. కానీ అమ్మకాలు మాత్రం మందగమనంలోనే ఉన్నాయి. 

also read మళ్లీ మార్కెట్లోకి బజాజ్ చేతక్‌... సరికొత్తగా

కొత్త వాహనాల కొనుగోలుపై నగరవాసులు అనాసక్తిగా ఉన్నారు. నచ్చిన కార్లు, బైక్‌లు కొనుక్కోవాలని ఉన్నా వాయిదాలు వేస్తున్నారు. ఏ నెలకానెల ఇలా వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ప్రతి ఏటా దసరా, దీపావళి పర్వదినాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలతో సందడిగా ఉండే షోరూమ్‌లు బోసిపోయి కనిపిస్తున్నాయి. 

గతేడాది అక్టోబర్‌తో పోల్చుకుంటే ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు 30 శాతానికి పడిపోయినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రతిఏటా ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కే వ్యక్తిగత వాహనాలు ఈ ఏడాది కొంతమేర తగ్గడం గమనార్హం. 

త్వరలో అందుబాటులోకి వచ్చే భారత్‌ స్టేజ్‌–6 టెక్నాలజీ వాహనాల కోసం సిటీజనులు ఎదురు చూస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బీఎస్‌–6 వాహనాలు వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రస్తుత బీఎస్‌–4 వాహనాల కొనుగోలుపై నగరవాసులు విముఖత చూపుతున్నారు. కార్లు, బైక్‌లలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. 

పాత వాటి స్థానంలో కొత్త వాహనాలకు నగరవాసులు అప్‌డేట్‌ అవుతున్నారు. దీంతో రెండు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దసరా, దీపావళి రోజుల్లో కళకళలాడాల్సిన షోరూమ్‌లు వెలవెలబోతున్నాయి. 

also read తొలి బీఎస్6 సర్టిఫికేషన్ పొందిన హీరో: త్వరలోనే స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌

నగరంలో సుమారు 150 ఆటోమొబైల్‌ షోరూమ్‌లు ఉండగా... వీటికి అనుబంధంగా మరో 100 వరకు సబ్‌డీలర్స్‌ షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతినెలా సుమారు 35వేలకు పైగా బైక్‌లు, మరో 10 వేలకు పైగా కార్ల  విక్రయాలు జరుగుతాయి. వీటిలో 10 శాతం వరకు స్పోర్ట్స్‌ బైక్‌లు, హైఎండ్‌ వాహనాలు ఉంటాయి. 

చెన్నై, బెంగళూర్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోటీ పడి హైదరాబాద్‌లో ఆటోమొబైల్‌ రంగం పరుగులు తీస్తోంది. గ్రేటర్‌ జనాభా కోటికి పైగా ఉంటే వాహనాల సంఖ్య అరకోటి దాటింది. కానీ ఈ ఏడాది అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు అన్ని నగరాల్లో ఆటోమొబైల్‌ రంగంపై ప్రభావం చూపుతున్నట్లే హైదరాబాద్ లోనూ జరుగుతోంది. 
దీనికి తోడు ఆర్థికమాంద్యంతో వల్ల కూడా ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కొత్త టెక్నాలజీ వాహనాలు మార్కెట్‌లోకి రానున్న నేపథ్యంలో దసరా, దీపావళి సీజన్‌ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. 

‘ప్రతిఏటా దసరా నుంచి దీపావళి వరకు కనీసం 1,000 బైక్‌లు విక్రయించేవాళ్లం. కానీ ఈసారి 700 కంటే ఎక్కువగా విక్రయించలేకపోయాం. బీఎస్‌–6 మోడల్ బైక్స్ వస్తే తప్ప విక్రయాలు పెరిగే అవకాశం లేదు. అందుకోసం మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే’అని ఒక ప్రముఖ ఆటోమొబైల్‌ షోరూమ్‌ డీలర్‌ తెలిపారు. 

‘బైక్‌ విక్రయాలు కొంచెం ఫర్వాలేదు. కానీ కార్ల అమ్మకాలే చాలా అధ్వానంగా ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి అమ్మకాలు పెరుగుతాయని ఆశించాం. కానీ అందుకు భిన్నంగా ఉంది’ అని మరో డీలర్‌ పేర్కొన్నారు. 

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ప్రతిరోజు సుమారు 180–200  వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కానీ వీటి సంఖ్య ప్రస్తుతం 150కి పడిపోయింది. అందులో బైక్‌లే ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

also read డోమినార్ 400 బైక్ ధర తగ్గించిన బజాజ్: ఎందుకంటే?

ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, కొండాపూర్, మలక్‌పేట్, మెహదీపట్నం, మేడ్చల్, సికింద్రాబాద్, బండ్లగూడ తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు 1850–2000 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వీటిలో 1700 వరకు బైక్‌లు ఉంటే మరో  300 వరకు కార్లు ఉంటాయి. కానీ ఈ సంఖ్య కొద్ది రోజులుగా గణనీయంగా పడిపోయింది. 

రోజుకు 1500 వరకు మాత్రమే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. వాటిలో బైక్‌లే ఎక్కువగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో సుమారు 48,000 వాహనాలు నమోదు కాగా... ఈ నెలలో ఇప్పటి వరకు ఆ సంఖ్య 33,600 వరకు ఉంది. 

‘మరికొద్ది రోజుల్లో అక్టోబర్‌ ముగియనుంది. కానీ అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు మాత్రం లేవు’ అని ఒక డీలర్‌ పేర్కొన్నారు. నిజానికి భాగ్యనగరంలో వాహనాల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 55.52 లక్షలకు చేరుకుంది. 

కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో అరకోటికి పైగా వాహనాలు ఉన్నాయి. రూ.లక్షల ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌లు, హైఎండ్‌ కార్లు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని పొదుపు పాటిస్తున్న మధ్యతరగతి వేతనజీవులు త్వరలో రానున్న బీఎస్‌–6 వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు.