భారత్ లో తన వాటాను పెంచుకోడానికి తహతహలాడుతున్న స్వీడన్ లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో మరో కొత్త మోడల్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది.  వోల్వో కార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రంప్‌ ఎక్స్‌సి 40ని విడుదలచేశారు.  2018 మే 29 నుండే ముందస్తు బుకింగ్ ప్రక్రియ ప్రారంభించిన వోల్వో ఎట్టకేలకు ఎక్స్‌సి 40ని మార్కెట్లోకి విడుదల చేసింది. 

దేశీయంగా లగ్జరీ కార్లకు మంచి గిరాకీ ఉన్నందున మార్కెట్లోకి ఎక్స్‌సి 40 ని తీసుకువచ్చినట్లు చార్లెస్‌ వెల్లడించారు. లగ్జరీ విభాగం భారత మార్కెట్ లో వేగంగా వృద్ది చెందుతున్నట్లు ఆయన తెలిపారు. 190 హార్స్ పవర్ సామర్థ్యంతో, అత్యాదునికి సౌకర్యాలతో వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు ఎక్స్‌సి 40ని వోల్వో రూపొందించినట్లు ఆయన తెలిపారు. దీని ఎక్స్ షోరూం ధర రూ. 39.9 లక్షలకు మార్కెట్లో అందుబాటులో ఉందని తెలిపారు.

భారత మార్కెట్లో తమ వాటాను రెండింతలు పెంచుకునే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు చార్లెస్ తెలిపారు. అందుకోసమే ఇప్పటికే భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ప్లాంట్‌లో ఎక్స్‌సి 90, ఎస్‌ 90 మోడల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నామని, త్వరలో ఎక్స్‌సి 60 మోడల్‌ను కూడా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చార్లెస్‌ ఫ్రంప్‌ వెల్లడించారు.