8 సెకన్లలో 100 కి.మీ వేగం...ఎంజీ మోటార్స్ ‘జెడ్‌ఎస్’ స్పెషాలిటీ
చైనా కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ త్వరలో భారత విపణిలోకి జడ్ఎస్ పేరిట తొలి విద్యుత్ కారును తేనున్నది. ఇది ఒక్కసారి ఫుల్ చార్జి అయితే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 8 క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఇక హ్యుండాయ్ విద్యుత్ కోనా కారుతో ఢీ కొడుతుందని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎంజీ మోటార్స్.. ‘జెడ్‌ఎస్’ పేరిట ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఈ కారు విక్రయాలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ మోడల్ 143 పీఎస్ పవర్‌తో అందుబాటులోకి రానుందని, ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుందని కంపెనీ వివరించింది.
తొలుత ఈ కారు ఢిల్లీ/ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉండనుందని కంపెనీ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. జనవరి నుంచి హైదరాబాద్ సహా మరో నాలుగు నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ కారు ను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. కాగా భారత మార్కెట్ కోసం రూ.10 లక్షల లోపు కాన్సెప్ట్ కారును తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.
హెక్టార్ మోడల్‌తో భారత విపణిలో ప్రవేశించి వినియోగదారులను ఆకట్టుకున్న ఎంజీ మోటార్స్ ఈసారి విద్యుత్ కారును విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఎంజీ జడ్ఎస్ ఈబీ పేరిట దీనిని భారత విపణిలోకి తేనున్నది. ఈ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి వస్తున్న తొలి విద్యుత్ ఎస్ యూవీ కారు ఇదే.
also read విపణిలోకి మహీంద్రా తొలి బీఎస్-6 ‘ఎక్స్‌యూవీ 300’
ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్‌లో విక్రయిస్తున్న మోడల్ కారునే భారత్లోకి తీసుకు వచ్చింది. కాకపోతే దీని అసెంబ్లింగ్ మాత్రం గుజరాత్లోని హలోల్ ప్లాంట్‌లో జరుగుతుంది. ఈ కారు హ్యుండాయ్ మోటార్స్ ఆధ్వర్యంలోని కోనా విద్యుత్ కారుకు గట్టి పోటీనిస్తుందని పేర్కొంది. దీని ధర వచ్చే నెలలో వెల్లడిస్తామని ఎంజీ మోటార్స్ వివరించింది.
కంపాక్ట్ ఎస్యూవీని తలపించే జడ్ ఎస్ ఈవీ.. హ్యుండాయ్ క్రెటా కంటే పొడవుగా, హెక్టార్ మోడల్ కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 4314 మి.మీ. పొడవు, 1809 మిమీ వెడలప్పు, 1620 మిమీ ఎత్తు, 2579 మిమీ వీల్ బేస్ కలిగి ఉంటుంది. వెడల్పుగా ఉన్న క్రోమ్ గ్రిల్స్తో కారుకు స్పోర్ట్స్ లుక్ లభిస్తుంది. ఒక పూర్తిస్థాయి ఎస్యూవీ కారుగా కంటే క్రాసోవర్ కారుగా బాగా సరిపోతుంది.
ఇంటిరియర్ కూడా బాగా ఆకట్టుకునేలా ఎంజీ మోటార్స్ తీర్చిదిద్దింది. ఎక్కడా గజిబిజిగా లేకుండా రూపుదిద్దుకున్న ఈ కారు డ్యాష్ బోర్డుపై ఎక్కువ స్విచ్లు, బటన్లతో హంగామా లేదు. క్యాబిన్‌కు నలుపు రంగు వేసినా డ్యాష్ బోర్డు వంటి చోట్ల కొంత సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చింది. ఎనిమిదంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంకు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సౌకర్యం ఉన్నాయి. యూఎస్బీ మొబైల్ చార్జింగ్ సౌకర్యం ముందు, వెనుక వరుసల్లోనూ ఉంది. అన్ని కార్లకు కూడా సన్ రూఫ్ ఇచ్చారు.
ఈ కారులో ఇస్మార్ట్ 2.0 కనెక్టెడ్ కారు టెక్నాలజీ, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్లను వాడారు. వాయు కాలుష్యం 300 ఏక్యూఐ వరకు ఉన్నా క్యాబిన్లోకి వచ్చే గాలి ఫిల్టర్ అవుతుంది.ఈ కారులో 44.5 కిలోవాట్స్ అవర్స్ శక్తిగల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి రీచార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది. దీనిలోని లిథియం అయాన్ బ్యాటరీ 40 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. అందుకోసం 50 కిలోవాట్స్ డీసీ చార్జర్ ఉండాలి. కంపెనీ మాత్రం 7.4 కిలోవాట్స్ చార్జర్ అందజేస్తుంది.
ఇందులో సిక్రోనస్ మోటార్ 141 బీహెచ్పీ శక్తి, 353 ఎన్ఎం టార్చిని విడుదల చేస్తుంది. 8 క్షణాల్లోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. ఈ కారులోని బ్యాటరీ వ్యవస్థకు ఐపీ 67 సర్టిఫికేషన్ ఉంది. దీంతో నీరు, దుమ్ము దీనిపై చేరే అవకాశం లేదు.
also read జాగ్వార్ నుండి కొత్త మోడల్ కార్...మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే ?
ఇప్పటికే భారత రోట్లపై ఈ కారు లక్ష కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని ఎంజీ మోటార్స్ తెలిపింది. కారుతోపాటు 15 ఎఎంపీ ఫ్లగ్స్ కూడా కంపెనీ అందజేస్తుంది. ఆఫీసు, ఇంట్లో చార్జి చేసుకోవడానికి 7.4 కిలోవాట్ల హోం చార్జర్ కూడా ఉంటుంది. ఎంజీ డీలర్ల వద్ద డీసీ పూపర్ ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కూడా కల్పిస్తుంది.
జడ్ ఎస్ ఈవీ విక్రయ ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎంజీ మోటార్స్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఫోర్టమ్ ఇండియాతో జత కట్టింది. ఈ రెండు సంస్థలు 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఈ కార్ల విక్రయాలు ఉన్న చోట చార్జీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల పరిధిలో ఎంజీ విద్యుత్ కారు విక్రయించే చోట చార్జీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ప్రతి మెట్రో నగరాల్లో ఐదేళ్లలో ఐదు కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ఇక బ్యాటరీల జీవిత కాలం పెంచేందుకు ఎంజీ మోటార్స్ ఎక్స్ కామ్ టెలె సిస్టంతో కలిసి పని చేయనుంది.