న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ భారత్‌లో 40,618 వ్యాగనార్‌ కార్లను రీకాల్‌ చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్‌ 15, నుంచి 2010 ఆగస్టు 12 మధ్య ఉత్పత్తి చేసిన కార్లలో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఫ్యుయల్‌ హౌస్‌లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సంస్థ పరిశోధకులు తేల్చడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 24 నుంచి కార్ల యజమానులను సంప్రదించడం ప్రారంభిస్తామని.. సమస్య ఉందని తెలితే వాటిని వెంటనే సరి చేస్తామని మారుతి సుజుకి తెలిపింది. సమస్యకు కారణమయ్యే విడిభాగాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుతామని పేర్కొంది. దీనికి ఎటువంటి సొమ్మును వసూలు చేయమని స్పష్టం చేసింది. 

వాహనాల్లో తలెత్తుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల పలు కంపెనీల తమ మోడళ్లపై విస్తృత పరిశోధనలు ప్రారంభించాయి. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తే వెంటనే వాటిని రీకాల్‌ చేసి సరిచేసే చర్యలు ముమ్మరం చేశాయి.

ఇటీవల జపాన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం హోండా సైతం భారత్‌లో 5,088 కార్లను రీకాల్‌ చేసింది. వీటిల్లో పాత తరానికి చెందిన జాజ్‌, సిటీ, సీఆర్‌-వీ, సివిక్‌, అకార్డ్‌ మోడళ్ల వాహనాలు ఉన్నాయి. గతంలో వీటికి అమర్చిన టకాట ఎయిర్‌బ్యాగ్‌లను మార్చడం కోసం వీటిని రీకాల్‌ చేశారు.