Maruti Suzuki sales: పెరిగిన మారుతీ సుజుకీ అమ్మకాలు..!
భారత వాహనాల తయారీలో అగ్రగామిగా దూసుకుపోతున్న మారుతి సుజుకి అటు వాహనాల తయారితో పాటు అమ్మకల్లోనూ మిగిలిన కంపెనీల కన్నా అత్యధిక సేల్స్ తో ఈ ఏడాది ముందుంది. తాజాగా గత నెల ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో మారుతి సుజుకి కంపెనీ అమ్మకాలు ఏకంగా 2% పెరిగాయి.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ఈ మార్చి నెలలో మొత్తం అమ్మకాలు 2 శాతం పెరిగి 1,70,395 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది మార్చిలో కంపెనీ 1,67,014 యూనిట్లను విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో కంపెనీ దేశీయ విక్రయాలు మార్చి 2021తో పోలిస్తే 7 శాతం క్షీణించి 1,43,899 యూనిట్లకు తగ్గాయి.2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం 16,52,653 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. 2020-21 కంటే 13 శాతం వృద్ధిని సాధించింది.
మొత్తం అమ్మకాలలో దేశీయ విక్రయాలు 13,65,370 యూనిట్లు కాగా, 2,38,376 వాహనాలను ఎగుమతి చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాహనాల ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కొంత ప్రభావం చూపింది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా పరిస్థితి అనూహ్యంగా కొనసాగుతున్నందున ప్రస్తుత సంవత్సరంలో కూడా ఇది కొంత ప్రభావం చూపవచ్చని మారుతీ సుజుకీ తెలిపింది.
గత నెలలో ఆల్టో, ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో జరిగిన అమ్మకాలు 24,653 తో పోలిస్తే 15,491 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్లతో సహా కాంపాక్ట్ విభాగంలో విక్రయాలు మార్చి 2021లో 82,201 కార్ల నుండి 82,314 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి.
మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ విక్రయాలు మార్చి 2021లో 1,628 యూనిట్లతో పోలిస్తే 1,834 యూనిట్లకు పెరిగాయి. విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 26,174 వాహనాల నుండి 25,001 యూనిట్లకు క్షీణించాయని మారుతీ సుజుకీ తెలిపింది. అయితే గత ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 11,597 యూనిట్ల నుంచి 26,496 యూనిట్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది.