జూన్ 30 వరకు ‘మారుతి‘ ఉచిత సర్వీసు: 5000 కార్ల ఎగుమతి.. హ్యుండాయ్
కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను మరో నెల రోజులు పొడిగించింది. దీంతో ఆటోమేకర్లు అందరూ తమ వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నారు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను మరో నెల రోజులు పొడిగించింది. దీంతో ఆటోమేకర్లు అందరూ తమ వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నారు. అంటే ఉచిత సర్వీసు, వారెంటీ, ఎక్స్‌టెండెడ్ వారెంటీస్ వంటి వాటిని కోల్పోకుండా వాటి గడవును పెంచాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా మారుతీ సుజుకి ఉచిత సర్వీసు, వారెంటీ, ఎక్స్‌టెండెడ్ వారెంటీని జూన్ 30 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. మార్చి 15- ఏప్రిల్ 30 మధ్య కాలపరిమితి ముగిసే వాటిని జూన్ 30 వరకు పెంచుతున్నట్టు తెలిపింది. ఫలితంగా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వినియోగదారులకు తగినంత సమయం ఉంటుందని తెలిపింది.
ఇదిలా ఉంటే, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర సంస్థల మాదిరిగానే మారుతి సుజుకి కూడా ‘బై నౌ.. పే లేటర్ ఆఫర్’ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. 90 శాతం రుణ సదుపాయంతో కారు తెచ్చుకునే వెసులుబాటు మారుతి సుజుకి అందిస్తోంది.
also read:మోదీ ఏడాది పాలన:రూ.27 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల వెల్త్ హాంఫట్
సుదీర్ఘ కాలం చెల్లింపుల కాలం.. రెండు నెలల ఈఎంఐ వాయిదా అవకాశం కూడా మారుతి సుజుకి కల్పిస్తోంది. అంటే ‘బై నౌ పే లేటర్ ఆఫర్’ ప్రకారం రుణం తీసుకున్న 60 రోజుల తర్వాత ఈఎంఐ చెల్లింపులు ప్రారంభం అవుతాయన్న మాట. మారుతి సుజుకి సెలెక్టెడ్ మోడల్స్ మీద జూన్ నెలాఖరు వరకు ‘బై నౌ.. పే లేటర్’ ఆఫర్ వర్తిస్తుంది.
మేలో 5000కి పైగా కార్లు ఎగుమతి చేశాం: హ్యుందాయ్
చెన్నై ప్లాంటులో మే 8న ఉత్పత్తిని పునఃప్రారంభించాక 5000కి పైగా కార్లను ఎగుమతి చేశామని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ‘పరిస్థితులు సాధారణ స్థితికి మార్చేందుకు మరోమారు మా ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాం. ప్రభుత్వం తలపెట్టిన ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని వేగవంతం చేసేందుకు తాము ఎంతలా కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమ’ని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈఓ ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు.