న్యూఢిల్లీ: బీఎస్-6 ప్రమాణాలతో వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నా కొద్దీ ఆ దిశగా వాహనాల తయారీ సంస్థలు ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. బీఎస్-4 ప్రమాణాలతో కూడిన ఆల్టో, స్విఫ్ట్, డిజైర్ తదితర ఎనిమిది మోడల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 

also read మాకు భాగ్య నగరమే భాగ్యరేఖ...: స్కోడా డైరెక్టర్

మారుతి సుజుకి సంస్థకు చెందిన ఆల్టో, బాలెనో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్-ఆర్ సహా హ్యాచ్ బ్యాక్, ఎర్టిగా తరహా బీఎస్-6 పెట్రోల్ వేరియంట్ కార్లను ఇప్పటికే సంస్థ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్స్ తన మోటారు సైకిళ్లు, స్కూటర్ల విభాగంలో ఇప్పటికే 30 శాతం మేరకు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి 2020 ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.

ఇక ఇప్పటికే డీలర్ల వద్ద పేరుకుపోయిన బీఎస్-4 వాహనాలను విక్రయించడానికి సంస్థలు వినియోగదారులకు భారీమొత్తంలో ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పాత వాహనాల విక్రయాలను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు ఈ అమ్మకాలపై దృష్టిని కేంద్రీకరించాయి. 

దశల వారీగా బీఎస్-4 వాహనాల ఉత్పత్తిని సంస్థ తగ్గిస్తూ వచ్చిందని మారుతి సుజుకి అమ్మకాలు, మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం మారుతి సుజుకి డీలర్ల వద్ద తక్కువ సంఖ్యలోనే వాహనాలు ఉన్నాయని చెప్పారు.మారుతి సుజుకికి చెందిన సెలేరియో మినీ, ఎకో ఎంవీపీ, సియాజ్ సెడాన్ పెట్రోల్ వేరియంట్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్చాల్సి ఉన్నదని సంస్థ తెలిపింది. బీఎస్4 నుంచి బీఎస్6 లోకి మార్చే క్రమంలో చిన్న కార్ల సెగ్మెంట్లో స్విఫ్ట్, బాలెనో, డిజైర్, బ్రెజా, మోడళ్లలో బీఎస్-6 డీజిల్ వర్షన్లను అభివృద్ధి చేయరాదని మారుతి ఇప్పటికే నిర్ణయించింది. 

also read బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్....ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త బైక్స్....

మరోవైపు సంస్థకు చెందిన పెద్ద కార్లు ఎస్-క్రాస్, సియాజ్ మోడళ్లను బీఎస్-6 డీజిల్ వేరియంట్లలో ఉత్పత్తి చేయాలా? వద్దా? అన్న విషయమై అధికారికంగా సంస్థ ప్రకటించాల్సి ఉన్నది. దాదాపు 200లకు పైగా వేరియంట్లు గల హీరో మోటోకార్ప్స్ సంస్థకు బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా బైక్లను అప్ డేట్ చేయడం కత్తిమీద సాము వంటిదేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. వీటిలో స్ప్లెండర్, ఫ్యాషన్, హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్స్, స్కూటర్ల విభాగంలో మ్యాస్టో ఎడ్జి, ఫ్లెజర్ వాహనాలను బీఎస్ -6 ప్రమాణాలకు అనుగునంగా మార్చినట్లు సమాచారం.