న్యూఢిల్లీ: డీజిల్‌ ఇంజిన్‌తో నడిచే చిన్న కార్ల తయారీ నిలిపి వేయాలని నిర్ణయించిన ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తెచ్చింది. డీజిల్ ఇంజిన్ల స్థానాన్ని సీఎన్‌జీ ఇంజిన్‌ కార్లతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీవీ రామన్‌ తెలిపారు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 కర్భన ఉద్గారాల నియంత్రిత  కార్లనే విక్రయించాల్సి ఉన్నందున, ఇంజిన్లను మెరుగు పరచాల్సి ఉంది. ఇందువల్ల డీజిల్‌ చిన్న కార్ల ధరలు భారీగా పెంచాల్సి వస్తుంది కనుక, గిరాకీ తగ్గుతుందనే భావనతో, అమ్మకాలే నిలిపేయాలని మారుతి సుజుకి ఇండియా గతంలోనే నిర్ణయించింది. 

ప్రస్తుతం దేశీయంగా విక్రయమవుతున్న మారుతీ కార్లలో డీజిల్‌ వాటా 23 శాతం కావడం గమనార్హం. ‘చిన్న కార్లకు డీజిల్‌ బదులు సీఎన్‌జీ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. పర్యావరణ హితం కూడా. సీఎన్‌జీ లభ్యత కూడా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది’ అని రామన్‌ తెలిపారు. ఇకపై పెట్రోల్‌, సీఎన్‌జీతో పనిచేసే బీఎస్‌ 6 ఇంజిన్లపైనే దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

సీఎన్‌జీ వేరియంట్‌లో ఆల్టో, ఆల్టో కే10, సెలెరియో, వ్యాగన్‌ఆర్‌, డిజైర్‌, ఎర్టిగా వాహనాలు లభిస్తాయి. దేశీయంగా రోడ్లపై ఉన్న సీఎన్‌జీ వాహనాలు 30 లక్షలు ఉంటే మారుతి సుజుకి ఇప్పటి వరకు ఐదు లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించింది.