న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీకి అమ్మకాల సెగ గట్టిగానే తగిలింది. అమ్మకాలు భారీగా పడిపోవడంతో గతనెలలోనూ సంస్థ ఉత్పత్తిని తగ్గించుకున్నది. వరుసగా మారుతి సుజకి ఉత్పత్తిని తగ్గించుకోవడం ఇది ఐదోసారి. జూన్‌లో సంస్థ 1,11,917 యూనిట్ల వాహనాలను ఉత్పత్తిచేసినట్లు బీఎస్‌ఈకి అందించిన సమాచారం మేరకు వెల్లడైంది. 

2018లో జూన్ నెలలో ఉత్పత్తి చేసిన 1,32,616 యూనిట్లతో పోలిస్తే 15.6 శాతం తగ్గాయి. వీటిలో ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 16.34 శాతం తగ్గి 1,09,641కు పరిమితమయ్యాయి. మినీ సెగ్మెంట్‌కు చెందిన వాహనాల్లో ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నది.

కేవలం 15,087 యూనిట్ల ఆల్టో కార్లను ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే నెలలో చేసిన 29,131 యూనిట్లతో పోలిస్తే 48.2 శాతం తగ్గించింది. కంప్యాక్ట్‌ సెగ్మెంట్‌లోని వ్యాగన్‌ ఆర్‌, సిఫ్ట్‌, డిజైర్ల ఉత్పత్తిని 1.46 శాతం కోత విధించడంతో 66,436లకు పడిపోయాయి. 2018 ఇదే నెలలో 67,426లను ప్రొడ్యూస్‌ చేసింది. 

స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) ఉత్పత్తిని కూడా 5.26 శాతం తగ్గించి 17,074లకు పరిమితం చేసింది. అంతక్రితం ఇది 18,023 యూనిట్లుగా ఉంది.వ్యాన్ల ఉత్పత్తితో 27.87 శాతం కోత విధించింది. దీంతో కేవలం 8,501 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. 

ఏప్రిల్‌ నెలలో 10 శాతం ఉత్పత్తిని తగ్గించుకున్న సంస్థ..ఆ తర్వాతీ నెలలోనూ 18 శాతం కోత విధించింది. మార్చిలో 20.9 శాతం కోత విధించిన మారుతి సుజుకి ఫిబ్రవరిలోనూ 8 శాతం తగ్గించింది. 

ఆర్థిక రంగం అంతంత మాత్రంగానే ఉండటం, మరోవైపు వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో ఈ ఏడాది జనవరి నుంచి ఆటోమొబైల్‌ సంస్థలు అమ్మకాల విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

మారుతి సుజుకీతోపాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటర్స్‌ కూడా డిమాండ్‌ లేమితో ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. మే నెలలో మొత్తం ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 18 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 2001 సెప్టెంబర్‌ తర్వాత వాహన విక్రయాలో ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. 

మిగతా నెలలో నమోదైన అమ్మకాలు ఇంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. గడిచిన నెలకు పూర్తిస్థాయి వాహన విక్రయాలను దేశీయ వాహనదారుల ఉత్పత్తి సంఘం (సియామ్‌), ఫాడా ఇంకా విడుదల చేయలేదు.