Asianet News TeluguAsianet News Telugu

16 వేరియంట్లు.. ఫీచర్ల మయం.. కియా ‘సెల్టోస్’ స్పెషాలిటీ ఇదీ


అనంతపురం వేదికగా కార్ల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసిన కియో మోటార్స్  దేశీయ విపణిలోకి కియా సెల్టోస్‌ విడుదల చేసింది. 16 రకాల వేరియంట్లు, పుష్కలమైన ఫీచర్లతో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. 

Kia Seltos price-variant-feature combination explained
Author
New Delhi, First Published Aug 23, 2019, 10:25 AM IST

న్యూఢిల్లీ/ముంబై: ఎంతోకాలంగా కార్ల ప్రేమికులు ఎదురుచూస్తున్న కియా సిల్టోస్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.9.69 లక్షల నుంచి గరిష్ఠంగా 15.99 లక్షల వరకు ఉంది. అంతే కాదు ఫీచర్లను బట్టి ధరలు ఉంటాయి. 

దక్షిణకొరియా సంస్థ కియా మోటార్స్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంటులో తయారు చేసిన మధ్యశ్రేణి స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) సెల్టోస్‌ను గురువారం ముంబైలో విడుదల చేసింది. పొరుగు దేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తామని ప్రకటించింది. 

2020 ఏప్రిల్‌ నుంచి నూతన కాలుష్య ఉద్గారాల నియంత్రణ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్-6 ప్రమాణాలతో ఈ ఎస్‌యూవీని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రతి 6 నెలలకు ఒక మోడల్‌ ఆవిష్కరిస్తామని సంస్థ గతంలోనే ప్రకటించిన సంగతి విదితమే. 

‘మాకు అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో సెల్టోస్‌ ఒకటి. భారత్‌లో కియా అడుగు దీంతోనే ప్రారంభమవుతోంది. మా శక్తియుక్తులు, నైపుణ్యాలన్నీ కలబోసి ఈ కారును ఆవిష్కరించాం’ అని కియా మోటార్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి కూహున్‌ షిమ్‌ పేర్కొన్నారు. 

ఈ కారును పలు పరీక్షలు చేశాకే విడుదల చేసినట్లు అని కియా మోటార్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి కూహున్‌ షిమ్‌ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దామన్నారు. ఈ విభాగ వినియోగదారుల అవసరాలన్నీ తీర్చేలా రూపొందించినట్లు స్పష్టం చేశారు.

కాగా, ఈ కారును తొలిసారి గతేడాది ఆటో షోలో ప్రదర్శించారు. భారత్‌లో ఈ కంపెనీ 2 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. పుష్కల వేరియంట్లలో అందుబాటులోకి తేవడంతో వినియోగదారులకు కార్ల ఎంపికకు విస్తృతమైన అవకాశం కల్పించినట్లైందని కియా మోటార్స్ కంపెనీ తెలిపింది. 

దీనిలో రెండు పెట్రోల్‌, ఒక డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. కారులో తొలి నుంచి బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఇంజిన్‌ను అమర్చారు. 

1.4 లీటర్‌ టర్బో పెట్రోల్‌ మోటార్‌ ఇంజిన్‌ 138 బీహెచ్‌పీ శక్తి, 242 ఎన్‌ఎం టార్క్‌ విడుదల చేస్తుంది. ఇందులో 7- స్పీడ్‌ మాన్యూవల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లను అమర్చారు.  

1.5ఎన్‌ఏ పెట్రోల్‌ ఇంజిన్‌ 113 బీహెచ్‌పీ శక్తి, 144 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ మోడల్ కారులో 6-స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌కు ఐవీటీ టెక్నాలజీని అనుసంధానించారు. 

1.5 లీటర్‌ వీజీటీ డిజల్‌ ఇంజిన్‌ 113 బీహెచ్‌పీ శక్తిని, 250 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 6- స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చారు.

ఈ కారు టెక్‌ లైన్‌, జీటీ లైన్‌ ఆప్షన్లలోనూ లభ్యం కానున్నది. ఒక్కో లైన్‌లో వినియోగదారులకు ఈ, కె, కె ప్లస్, ఎక్స్‌, ఎక్స్‌ ప్లస్ మోడల్ కార్లు అందుబాటులో ఉంటాయి. ప్రీమియం లుక్స్‌తో టెక్‌లైన్‌, స్పోర్టీ లుక్‌తో జీటీ లైన్‌ను తయరు చేశారు. 

కియా సెల్టోస్‌ మోడల్ కారు ఫీచర్లకు నిలయంగా మార్చేశారు. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌కు జ్యువెల్‌ ఎఫెక్ట్‌ ఉంది. 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్‌ ఓఆర్‌ఎం, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌లో యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో ఫీచర్లు ఉన్నాయి. 

8 బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌ స్పీకర్లు, మూడ్‌ లైటింగ్‌, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జింగ్‌, ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌, 360 కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, ఈబీడీ, ఫ్రంట్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌, ఈఎస్‌పీ, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, బ్లైండ్‌ వ్యూ మానిటర్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు కోసం అత్యంత బలమైన ఉక్కును ఉపయోగించారు. 

కియో సెల్టోస్ కారులో యూవీవో కనెక్టివిటీ ఫీచర్‌ ఉంది. దీనిద్వారా 37 స్మార్ట్‌ ఫీచర్లను అనుసంధానించుకోవచ్చు. జియో ఫెన్సింగ్‌, రిమోట్‌ ఏసీ కంట్రోల్‌తో పాటు ఇంజిన్‌ స్టార్ట్‌, నేవిగేషన్‌, టైర్‌ ఒత్తిడిని పర్యవేక్షించే వ్యవస్థలు ఉన్నాయి. దీంతోపాటు నార్మల్‌, ఎకో, స్పోర్ట్‌ అనే డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఇక బురదలో, మంచులో వెళ్లేటప్పుడు ఉపయోగపడేలా ట్రాక్షన్‌ కంట్రోల్‌ వ్యవస్థలు ఉన్నాయి. 

భారత్‌ మార్కెట్లోకి కియో మోటార్స్ ప్రణాళికా ప్రకారం అడుగుపెట్టింది. మొత్తం 160 పట్టణాల్లో 265 టచ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో 206 సేల్‌  పాయింట్లు ఉన్నాయి. బుకింగ్స్‌ మొదలైనప్పటి నుంచి దాదాపు 23వేల ఆర్డర్లను అందుకున్నది. 2021 వరకు ప్రతి ఆరు నెలలకు ఒక కొత్తకారును భారత మార్కెట్లో విడుదల చేయాలని కియా లక్ష్యంగా పెట్టుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios