ఉదయ్‌పూర్‌: దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుండాయ్‌ బీఎస్‌-6లోకి మార్చిన మోడళ్లను ఈ  ఏడాది చివర్లో మొదలు పెడుతుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో మార్చి చివరి వరకు  బీఎస్‌-4 వాహనాల విక్రయాన్ని కూడా కొనసాగిస్తామని పేర్కొంది. 

బీఎస్-6లో గ్రాండ్ ఐ 10 నియోస్ మాత్రమే లభ్యం
ప్రస్తుతం హ్యుండాయ్‌ ‘గ్రాండ్‌ ఐ10 నియోస్‌’ మోడల్‌ కారు మాత్రమే బీఎస్‌-6 మోడల్‌ అందుబాటులో ఉంది. దీనిలోనూ పెట్రోల్‌ వేరింయట్‌ మాత్రమే లభిస్తోంది. మరోపక్క మారుతిసుజుకికి చెందిన ఏడు పెట్రోల్‌ కార్లు బీఎస్‌-6 నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్నాయి. 

వచ్చే ఏడాది ప్రారంభంలోగా బీఎస్-6 వెహికల్స్: హ్యుండాయ్
‘ఈ  ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ మా బీఎస్‌-6 మోడల్‌ వాహనాలు మార్కెట్లోకి వస్తాయి. క్రమ పద్దతిలో బీఎస్‌-6 వాహనాలను మార్కెట్లోకి తెస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం అన్ని మోడళ్లను బీఎస్‌-6లోకి అప్‌గ్రేడ్‌చేస్తాం. మరోపక్క ధరలు కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చూస్తాం’ అని హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈవో ఎస్‌ఎస్‌ కిమ్‌ పీటీఐకి తెలిపారు.  

కియా మోటార్స్ సెవెన్ సీటర్ల కారు తయారీ సన్నాహాలు  
దేశీయంగా గిరాకీ పెరుగుతున్నఏడు సీట్ల కారును అనంతపురం ప్లాంట్‌లో తయారు చేయడానికి కియా మోటార్‌ సన్నద్ధమవుతోందని సమాచారం. సెప్టెంబరు 15 నుంచే ఆ కారు ప్రయోగాత్మక తయారీ చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొరియా రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్నివాల్‌ మోడల్‌లో కొన్ని మార్పులు చేసి ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు తెలిసింది. 

ఏటా మూడు లక్షల కార్ల ఉత్పత్తి కోసం రోబోల సేవలిలా
ఏడాదికి 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన 300 రోబోలు ఇక్కడ సేవలందిస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడం వల్లే కియా సెల్టోస్‌ కారుకు భారత్‌లో అపూర్వ ఆదరణ లభిస్తోందని సంస్థ ఎండీ, సీఈవో కూక్యుమ్‌ షిమ్‌ పేర్కొన్నారు. ఈప్లాంట్‌లోని 1,948 మంది ఉద్యోగుల్లో 83 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌ వారేనని షిమ్‌ తెలిపారు.