న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) తన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ డబ్ల్యూఆర్‌-వీ సెగ్మెంట్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.9.95లక్షలుగా నిర్ణయించింది. డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో వస్తున్న వీ గ్రేడ్‌ కారు.. ఎస్‌, వీక్స్‌ గ్రేడ్‌లకు మధ్యస్థంగా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 

డబ్ల్యూఆర్- వీ కారుకు వెనుకవైపు పార్కింగ్‌ సెన్సర్లను అమర్చారు. ముందు కూర్చునే వారికి సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించే రిమైండర్‌, హైస్పీడ్‌ అలెర్ట్‌, స్పీడ్‌ సెన్సింగ్‌ ఆటో డోర్‌ లాక్‌ వంటివి ఎస్‌, వీఎక్స్‌ గ్రేడుల్లో లభిస్తాయని కంపెనీ తెలిపింది. 

ఇందులోని వీ గ్రేడ్‌లో ఇన్ఫోటైన్‌మెంట్‌, 17.7 అంగుళాల నావిగేషన్‌ టచ్‌స్క్రీన్‌, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌, ఆన్‌ ఆఫ్‌ చేసేందుకు ప్రత్యేక బటన్‌ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త డబ్ల్యూఆర్‌-వి వినియోగదారుల మన్ననలను చూరగొంటుందని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) రాజేశ్‌ గోయ్‌ తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ సిగ్నేచర్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్ఎస్), పొజిషన్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, గన్ మెటల్ ఫినిష్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ తదితర ప్రీమియం ఎక్స్ టీరియర్ ఫీచర్లు దీని సొంతం.