ముంబై: పెరిగిన వడ్డీరేట్లు, కార్ల అధిక ధరలు వచ్చే పండుగల సీజన్ వినియోగదారుడి సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. కేరళలో వరదల ప్రభావం మాదిరిగానే దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుపై ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కొందరు కారు డీలర్లు, ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కేవలం జూలై నెలలో మాత్రమే వివిధ కార్ల ఉత్పత్తుల కొనుగోళ్ల డిమాండ్ రికవరీ సాధించింది. ఒకవేళ రోజువారీ విక్రయాలు తగ్గుముఖం పడితే డీలర్లు తమ ఆర్డర్లు తగ్గించాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. 

కేరళలో ఓనం పండుగ మొదలు నవంబర్ నెలలో దీపావళి వరకు దేశమంతటా పండుగల సీజన్. వినియోగదారులు సంప్రదాయంగానే పండుగల సందర్భంగా కార్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ద్రుష్టిలో పెట్టుకుని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) జూన్, ఆగస్టు నెలల్లో రెండు దఫాలు రెపోరేట్ పెంచేసింది. మధ్యేమార్గంగా ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి తగ్గించాలని ఆర్బీఐ లక్ష్యం. కానీ వడ్డీరేట్ల పెంపకంతో వినియోగదారుల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని డీలర్లు, వివిధ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. 

హోండా కార్స్ ఇండియా డీలర్ ఒకరు మాట్లాడుతూ ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం సేల్స్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంధన ధరల్లో అస్థిరత, ఆహార ధాన్యాల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన మోడల్ కార్లు మార్కెట్‌లోకి విడుదల చేసినా పండుగ సీజన్‌లో విక్రయాలు తగ్గుతాయి’ అని చెప్పారు. పండుగల సీజన్‌ స్కీమ్‌లతో కొత్త మోడల్ కార్లతో ముందుకు వచ్చినా ఫలితాలు నామమాత్రమేనని ముంబైకి చెందిన మారుతి సుజుకి డీలర్ ఒకరు చెప్పారు. వినియోగదారులు ఒకవేళ కార్లను కొన్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తారన్నారు. దీనికి ఆయా కార్ల ధరలు పెరగడమే కారణమన్నారు. 

వివిధ కార్ల కొనుగోళ్లు, ధరల పెరుగుదలపై ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల పరిధిలో ఐదువేల మందికి పైగా ప్రజలతో సర్వే నిర్వహించింది. గత 12 నెలల్లో ధరలు పెరిగాయని 83 శాతం మంది పేర్కొన్నారు. కేవలం 48.2 శాతం మంది మాత్రం గతంతో పోలిస్తే సాధారణ ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయని పేర్కొన్నారు. 27.7 శాతం మంది మాత్రం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే టయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా మాట్లాడుతూ ప్రస్తుతం వినియోగదారుడి సెంటిమెంట్ తమకు ఒక సవాలేనని చెప్పారు. కార్లు కొనేవారు అత్యధికంగా ఇళ్లు, కార్ల రుణాలు తీసుకోవాల్సి వస్తుందని, వడ్డీరేట్లు పెరగడం ఆందోళనకరమని అన్నారు. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. ఓనం పండుగ సందర్భంగా కేరళలో కార్ల కొనుగోళ్లు రెట్టింపవుతాయని అంచనా వేశామని, కానీ ప్రస్తుతం పరిస్థితి అతిపెద్ద సవాల్ అని చెప్పారు. 

హోండా, హుండాయ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల కార్ల విక్రయాలు ఐదు నుంచి 10 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సాధారణ వర్షపాతంతోపాటు నూతన మోడల్ కార్ల రంగ ప్రవేశంతో కీలక పంటలకు కనీస మద్దతు ధర పెరుగడంతో పరిస్థితి బుల్లిష్‌గా ఉండే అవకాశం ఉన్నదని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. హోండా కార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేశ్ గోయల్ మాట్లాడుతూ వడ్డీరేట్ల పెంపు డిమాండ్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమేజ్ సెడాన్, సీఆర్ వీ వంటి ఎస్యూవీ మోడల్ కార్ల విక్రయానికి డిమాండ్ ఉంటుందన్నారు. 

మంచి వర్షపాతం నమోదైతే పరిస్థితుల్లో మెరుగుదల వస్తుందని మహింద్రా సేల్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు విజయ్ రాం నక్రా చెప్పారు. అయితే అధిక ఇంధన ధరలు, వడ్డీరేట్లు పూర్తిగా పరిస్థితిని దెబ్బ తీస్తాయని తెలిపారు. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రుతి సాబూ మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే వడ్డీరేట్లు, ఇంధన ధరల పెరుగుదల ఆందోళనకరమేనన్నారు. మారుతి సుజుకి విక్రయాలపై దారుణ ప్రభావం చూపొచ్చన్నారు. కానీ దీనిపై స్పందించేందుకు మారుతి సుజుకి ప్రతినిధి ముందుకు రాలేదు.