Asianet News TeluguAsianet News Telugu

శుభవార్త: విద్యుత్ కారు కొంటే రూ.4 లక్షల వరకూ రాయితీ గ్యారంటీ

విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగానికి ఊతమిస్తూ కాలుష్య నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేయనున్నది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని 2015లో పారిస్ సదస్సు సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు సంకేతాలిస్తోంది

Government may offer Rs 1.4 lakh sop for each electric vehicle
Author
Hyderabad, First Published Aug 26, 2018, 12:10 PM IST


న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగానికి ఊతమిస్తూ కాలుష్య నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేయనున్నది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని 2015లో పారిస్ సదస్సు సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు సంకేతాలిస్తోంది. 

ఒక్కో ఎలక్ట్రిక్ కారు కోసం దాదాపు రూ.1.4 లక్షల రాయితీని నేరుగా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్వి, త్రిచక్ర తదితర ఇతరత్రా విద్యుత్ వాహనాల కొనుగోళ్లపైనా ప్రోత్సాహకాలను పొడిగించింది. అంతేగాక ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో లేని ఎగువ శ్రేణి ఎలక్ట్రిక్ కార్ల కోసం కూడా గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు రాయితీని అందించే వీలున్నట్లు తెలుస్తోంది.

దేశీయ కార్లకు గరిష్ఠంగా ధరలో 20 శాతం రాయితీ
ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా విక్రయిస్తున్న విద్యుత్ ఆధారిత కార్లకైతే సుమారు రూ.1.4 లక్షల మేర సబ్సిడీని పొందవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే గరిష్ఠ రాయితీ వాహన విలువలో 20 శాతం మించరాదని నిర్ణయించినట్లు సమాచారం. 

ఈ మేరకు వ్యయ కార్యదర్శి ఏఎన్ ఝా నేతృత్వంలో ఇటీవల జరిగిన వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శుల కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. దేశంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, తయారీని వేగవంతం చేయాలన్న ఫేమ్-2 రెండో దశలో భాగంగా ఈ సిఫారసులు వచ్చాయి.

అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలుకు సన్నాహాలు

వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకానికి గతంతో పోల్చితే నిధులను రూ.4,000 కోట్ల నుంచి 5,500 కోట్లకు పెంచాలని కమిటీ నిర్ణయించింది. అయితే వీటన్నింటిపై కేంద్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

 ఫేమ్-1 కేటాయింపులు రూ.700 కోట్లు మాత్రమేనన్న సంగతి తెలిసిందే. పెరిగిన డీజిల్, పెట్రోల్ ఆధారిత వాహనాల వినియోగంతో పర్యావరణానికి ఏర్పడుతున్న తీవ్ర ముప్పు దృష్ట్యా కాలుష్య రహితమైన విద్యుత్ ఆధారిత వాహనాల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్రక్ట్రిక్ వాహనాలతో దేశీయ దిగుమతుల్లో అధికంగా ఉన్న ముడి చమురు చెల్లింపులనూ తగ్గించుకోవచ్చన్నది సర్కార్ యోచన. ఫలితంగా కరెంట్ ఖాతా లోటూ అదుపులోకి వస్తుందని భావిస్తున్నది.

బుగాట్టి డివో @ రూ.40 కోట్లు
సూపర్ కార్ల తయారీ దిగ్గజం, ఫ్రాన్స్ ఆటోమొబైల్ సంస్థ బుగాట్టి.. శనివారం ఓ సరికొత్త సూపర్ కారును పరిచయం చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోగల మాంటేరీ నగరంలో డివో పేరుతో ఆవిష్కృతమైన ఈ కారు ధర 5.8 మిలియన్ డాలర్లు. డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం రూ.40.47 కోట్ల పైమాటే. 

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగలిగిన బుగాట్టి చిరాన్ సూపర్ కారు కంటే కూడా స్పీడ్‌తో డివో మలుపుల్ని తిరుగగలదు. ఏరోడైనమిక్స్ ప్రోగ్రాంలో మార్పులు, వాహన ఫ్రేమ్ ఆధునికీకరణ, సస్పెన్షన్ అప్‌గ్రేడ్‌తో చిరాన్ కంటే 77 పౌండ్లు బరువు తగ్గిన డివో.. ధరలో మాత్రం 2.8 మిలియన్ డాలర్లు పెరిగింది. చిరాన్ ధర 3 మిలియన్ డాలర్లుగానే ఉన్న విషయం తెలిసిందే.

చిరాన్ కంటే వేగంగా బుగ్గాటి డీవో వేగం

నేరుగా ఉన్న మార్గాల్లో డివో గరిష్ఠ వేగం గంటకు 236 మైళ్లు అవగా, చిరాన్‌ది 266 మైళ్లు. మూల మలుపుల్లో మాత్రం చిరాన్ కంటే డివోనే వేగంగా పయనించగలదని సంస్థ అధ్యక్షుడు స్టిఫెన్ వింకిల్మన్ తెలిపారు. ఇకపోతే కేవలం 40 డివోలనే బుగాట్టి తయారు చేస్తున్నది.

 ఇప్పటికే ఇవన్నీ అమ్ముడైపోవడం (బుకింగ్) విశేషం. ఫ్రాన్స్‌లోని తమ ప్రధాన కేంద్రం మాల్షీమ్‌లో త్వరలో డీవో కార్ల ఉత్పత్తిని బుగాటి ప్రారంభించనున్నది. 8 లీటర్ల సామర్థ్యం కలిగిన 16 సిలిండర్ల ఇంజిన్‌తో కూడిన డివో.. 1,500 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ప్రత్యేక ఏర్పాట్లు ఇంజిన్‌ను కూల్‌గా ఉంచుతాయని, బ్రేకింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయనున్నాయని వింకిల్మన్ చెప్పారు

Follow Us:
Download App:
  • android
  • ios