అమరావతి: వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు తిరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  శుక్రవారం సచివాలయంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. 


తిరుమల-తిరుపతితోపాటు ఇతర ముఖ్య పట్టణాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయోగాత్మకంగా నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఈ సమావేశంలో సూచించారు.దాని కోసం ఇంధన శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వారంలోగా ప్రతిపాదనలు రూపొందించి బస్సులు తిప్పేందుకు టెండర్లు పిలవాలని సూచించారు. 

బస్సులు, లారీలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు త్వరితగతిన ఎలక్ట్రిక్‌ వాహనాల్లా మారేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.   ఎలక్ట్రిక్‌ రవాణా వాహన విధానం-2018లో సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ఇదివరకే (2018-2023) ప్రత్యేక విధానాన్ని రాష్ట్రం ప్రకటించింది. 

పదివేల ఎలక్ట్రిక్‌ వాహనాలను రాష్ట్రానికి పంపేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థఈఈఎస్‌ఎల్‌తో ఇప్పటికే నెడ్‌క్యాప్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని రాయితీలనిస్తూ విధానంలో సవరణలు చేసింది.