న్యూఢిల్లీ: ఇటాలియన్‌ సూపర్‌ బైక్‌ తయారీదారు డ్యూకాటీ.. దేశీయ మార్కెట్లోకి మల్టీస్ట్రాడా 1260 ఎండ్యూరోను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.19.99 లక్షలుగా నిర్ణయించారు. ఆఫ్‌ రోడ్‌, టూరింగ్‌ సామర్థ్యాలను పెంచే విధంగా ఈ బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశామని డ్యూకాటీ తెలిపింది. 

స్పోర్టీ, అడ్వెంచర్‌ బైక్‌ విభాగంలో మల్టీస్ట్రాడా కొత్త అధ్యాయానికి తెరలేపనున్నదని పేర్కొంది. భారత్‌లో ఆఫ్‌ రోడ్‌, అడ్వెంచర్స్‌ చేసే వారికి ఈ బైక్‌ చక్కగా సరిపోతుదని డుకాటీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్గీ కనోవాస్‌ తెలిపారు.

హైదరాబాద్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు, కోచి, కోల్‌కతా, చెన్నైల్లోని డ్యూకాటీ డీలర్‌షిప్‌ల్లో మల్టీస్ట్రాడా 1260 ఎండ్యురో బుకింగ్‌లను ప్రారంభించినట్లు సెర్గీ చెప్పారు.

డ్యూకాటీ మల్టీస్ట్రాడా 1260 ఎండ్యూరో బైక్ రెండు రంగుల్లో లభిస్తుంది. రెడ్ రంగులో లభించే బైక్ ధర రూ.19,99 లక్షలు కాగా, శాండ్ కలర్ బైక్ ధర రూ.20.23 లక్షలుగా నిర్ణయించారు. ఆల్ న్యూ మల్టీస్ట్రాడా 1260 ఎండ్యూరో పూర్తిగా న్యూ 1262 సీసీ డ్యుకాటీ టెస్ట్రాస్టెట్టా డీవీటీ టెక్నాలజీ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నది. 

మల్టీస్ట్రాడా 1260 ఎండ్యూరో బైక్ లకు 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రేర్ వీల్, ఎలక్ట్రానిక్ సెమీ యాక్టివ్ సాచ్స్ సస్పెన్షన్, 30 లీటర్ల ఇంధన ట్యాంక్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ‘రైడ్ బై వైర్’తో స్మూథర్ థ్రొట్టిల్ కంట్రోల్, ఔట్ స్టాండింగ్ సేఫ్టీని నియంత్రించొచ్చు.

గత మోడల్ బైక్ తో పోలిస్తే ఇంజిన్ పై టార్చ్ కర్వ్ తిరిగి ఉంటుంది. కీలక మల్టీ మీడియా ఫంక్షన్లతో, క్రూయిజ్ కంట్రోల్, హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్‌తో కంఫర్టబుల్ రైడింగ్ చేయొచ్చు. ఒకసారి బైక్ పై బయలుదేరితే 450 కిలోమీటర్ల వరకు అలవోకగా ప్రయాణం చేయొచ్చు.