న్యూఢిల్లీ: హ్యుండాయ్, కియా మోటార్స్, ఎంజీ మోటర్స్ సహా ఆటోమొబైల్ సంస్థలన్నీ ధన త్రయోదశి (దంతేరాస్) సందర్భంగా శుక్రవారం 15 వేలకు పైగా కార్లను వినియోగదారులకు డెలివరీ చేశాయి. వినియోగదారులు కూడా పవిత్రమైన దంతేరాస్ సందర్భంగా ముఖ్యమైన వస్తువుల కొనుగోలు చేయడానికి, డెలివరీ తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. 

దేశంలో రెండో అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ ఒక్కటే 12,500 కార్లను కొనుగోలుదారులకు అందజేసింది. దాని అనుబంధ కియా మోటార్స్ నూతనంగా ఆవిష్కరించిన సెల్టోస్ ఎస్‌యూవీ మోడల్ కారును 2,184 యూనిట్లను కస్టమర్లకు పంపిణీ చేసింది. 

also read ఇండియాలో అడుగుపెట్టనున్న స్కోడా కోడియాక్ ఆర్ఎస్...

అలాగే ఎంజీ మోటార్స్ ఇండియా తన ఎస్ యూవీ మోడల్ హెక్టార్ కారును కొనుగోలు చేసిన 700 మందికి వాటి తాళాలను అందజేసింది. కేవలం ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోనే 200 కార్లను పంపిణీ చేసింది. మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) గణనీయ సంఖ్యలోనే కార్లను పంపిణీ చేశామని తెలిపింది. 

కియా మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ మాట్లాడుతూ తమ వినియోగదారులకు సీమ్ లెస్ ఓనర్ షిప్ అనుభవాన్ని అందిస్తున్నామని చెప్పారు. రికార్డు సమయంలో నమోదు చేసిన సెల్టోస్ మోడల్ బుకింగ్స్‌ను అదే రికార్డు సమయంలో డెలివరీ చేయాలని లక్షంగా పెట్టుకున్నది. ఇప్పటికే ఉత్పాదక యూనిట్ లో రెండో షిప్ట్ కూడా ప్రారంభించింది. 

also read మారుతిపై సేల్స్ దెబ్బ: క్షీణించిన లాభాలు...

ఎంజీ మోటార్స్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రాకేశ్ సిదానా మాట్లాడుతూ ‘తాజా హెక్టార్ మోడల్ కారు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు పంపిణీ చేయడం ద్వారా బెస్ట్ ఇన్ క్లాస్ ఎక్స్ పీరియన్స్ అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. హెక్టార్ మోడల్ కారు కోసం 38 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. సరైన సమయంలో డెలివరీ కోసం వచ్చే నెల నుంచి రెండో షిఫ్ట్ ఉత్పత్తి ప్రారంభించనుంది.