న్యూఢిల్లీ: దేశంలో ప్రయాణ వాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా తొమ్మిదో నెలలోనూ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పడిపోయాయి. జూలైలో కేవలం 2,00,790 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది 19 ఏళ్ల కనిష్టానికి సమానం. 2000 డిసెంబర్ లో చివరిసారిగా 35 శాతం వాహన విక్రయాలు పడిపోయాయి. 

గతేడాది జూలైలో విక్రయమైన 2,90,931 యూనిట్లతో పోలిస్తే ఇది 30.98శాతం తక్కువ అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్ ‌(సియామ్‌) ఆందోళన వ్యక్తం చేసింది.  

దేశీయ కార్ల విక్రయాలు 35.95శాతం తగ్గి 1,22,956 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఏడాది క్రితం జూలై నెలలో ఈ విక్రయాలు 1,91,979 యూనిట్లుగా నమోదయ్యాయి.

2018 జూలైలో 18,17,406 యూనిట్ల ద్విచక్రవాహనాలు అమ్ముడవగా.. గత నెలలో ఆ సంఖ్య 16.82శాతం తగ్గి 15,11,692 యూనిట్లుగా ఉంది. కమర్షియల్‌ వాహనాల విక్రయాలు కూడా 25.71శాతం తగ్గి 56,866 యూనిట్లుగా నమోదయ్యాయి. 

అన్ని కేటగిరిల్లో కలిపి జూలైలో వాహన విక్రయాలు 18.71 శాతం తగ్గాయి. 2018 జూలైలో 22,45,223 యూనిట్ల వాహనాలు అమ్ముడవగా.. క్రితం నెలలో కేవలం 18,25,148 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. 

ఆటోమొబైల్‌ రంగంలో ఇంత తక్కువ స్థాయిలో అమ్మకాలు జరగడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా  2000  డిసెంబర్ నెలలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 35%పడిపోయాయి. గిరాకీ లేకపోవడంతో ఆటోమొబైల్‌ సంస్థల వద్ద నిల్వలు పేరుకుంటున్నాయి. దీంతో ఉత్పత్తిని తగ్గించాలని కంపెనీలు భావిస్తున్నాయి. మరోవైపు ఆటోమొబైల్‌ వాహనాలపై జీఎస్‌టీని తగ్గించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.